– సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
* 94-95శాతం ప్రజలు లాక్ డౌన్ పొడిగించాలని కోరారు
* నిజాముద్దీన్ సమస్య కొనసాగుతోంది
* మే నెలలోనూ రేషన్ కార్డు దారులకు 12 కేజీల బియ్యం, రూ.1500
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. బయటి నుంచి ఎవరూ తినుబండారాలు తెప్పించుకోవద్దన్నారు. దేశంలో విమాన సర్వీసులు ఎక్కడ నడిచినా తెలంగాణకు మాత్రం రావడానికి వీల్లేదన్నారు. వైద్యులు, పోలీసులకు నెలవారీ జీతంలో 10శాతం గ్రాస్ అదనంగా ఇస్తామన్నారు.
ఆదివారం ప్రగతి భవన్ లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘20వ తేదీనుంచి సడలింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో సడలింపులు ఇవ్వడం లేదు. నిత్యావసరాలకు తప్ప రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు లేవు. ప్రజారోగ్యమే మాకు ముఖ్యం.’ అని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఈనెల 19వ తేదీ వరకు 858 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. 186 మంది కోలుకున్నారని వెల్లడించారు. 651 మందికి ట్రీట్ మెంట్ అందుతోందని చెప్పారు. 21మంది కరోనాతో మృతి చెందారని, ప్రస్తుతం ఎవరికీ సీరియస్గా లేదని స్పష్టంచేశారు. తెలంగాణకు వచ్చిన విదేశీ ప్రయాణికులు వందశాతం కోలుకున్నారని అన్నారు. వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో జీరో కేసులు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశవ్యాప్తంగా పోలిస్తే తెలంగాణలో మరణాల రేటు తక్కువగా ఉందన్నారు. పది రోజులకు ఒకసారి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు లక్షల ఎన్-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సింగపూర్ లో మళ్లీ లాక్ డౌన్ విధించారని.. ఇలా 42 దేశాల్లో కొనసాగుతుందన్నారు.. మే 1వ తేదీ వరకు కరోనా రోగులకు 28 రోజుల చికిత్స పూర్తవుతుందన్నారు. మే 1 నుంచి కేసులు తగ్గుతాయనే నమ్మకం ఉందన్నారు. ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గి, జొమాటో సేవలకు తెలంగాణలో అనుమతి లేదన్నారు.
ఇంటి రెంట్లు అడగొద్దు
మూడు నెలల పాటు ఇంటి ఓనర్లు రెంట్లు వసూలు చేయకూడదని, ఎవరైనా ఇబ్బంది పెడితే డయల్ 100 కు ఫిర్యాదు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇళ్ల రెంట్ కోసం వేధించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. మే నెల వరకు ప్రతి రేషన్కార్డులోని ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యంతో పాటు రూ.1500 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల్లో 50శాతం, ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75శాతం కోత ఉంటుందని స్పష్టం చేశారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు వందశాతం వేతనాలు ఇస్తామన్నారు. ప్రైవేట్ స్కూళ్లు ఎట్టి పరిస్థితిలోనూ అదనపు ఫీజులు వసూలు చేయకూడదని హెచ్చరించారు. నెలవారీ ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేసుకోవచ్చన్నారు.
ఎరువులు, విత్తనాలు కొనవచ్చు
మే 5 నుంచి రైతులు ఎరువులు, విత్తనాలు కొనవచ్చని, గుంపులు గుంపులుగా వ్యవసాయ పనులు చేయకూడదని సూచించారు. యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు అనుమతి ఉండదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మే 5న కేబినెట్ మరోసారి సమావేశమై లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన రూ.1500 వెనక్కి పోతాయని ఎవరూ కూడా భయపడవద్దన్నారు. గచ్చిబౌలి స్టేడియంలోని 540 గదులు ఉన్న భవనంతో పాటు పక్కనే ఉన్న 9 ఎకరాల స్థలాన్ని ఆరోగ్యశాఖకు అప్పగించామన్నారు.