అసలే తమిళలకు ప్రాంతీయ అభిమానం ఎక్కువ. అక్కడి హీరోల ఫ్యాన్స్ చిన్న చిన్న విషయాలకు కూడా కాలు దువ్వుతుంటుంటారు. అలాంటిది ఎంతో మంది తమిళులను పొట్టన పెట్టుకుంది శ్రీలంక. అక్కడి క్రికెటర్ గురించి సినిమా తీస్తామంటే ఒప్పుకుంటారా? కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితచరిత్ర ఆధారంగా ‘800’ అనే చిత్రాన్ని ఎంఎస్. శ్రీపతి దర్శకత్వంలో ట్రైన్ మోషన్ పిక్చర్స్, వివేక్ రంగాచారి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టుగా ప్రకటించడమే కాదు.. మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
వరల్డ్ టెస్ట్ క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ సాధించిన ఘనతను తెరకెక్కించాలనుకోవడంలో తప్పు లేదు కానీ, అతను శ్రీలంకకు చెందిన ప్లేయర్ కావడమే కొంచెం వివాదాస్పదంగా మారింది. అయితే సినిమా అనౌన్స్ మెంట్ విషయంలో నోరు మెదపని నెటిజన్లు మోషన్ పోస్టర్ విడులయ్యే సరికి ఒక్కసారిగా రగిలిపోతున్నారు. మురళీధరన్ తమిళీయుడే అయినా శ్రీలంక క్రికెటర్గా ప్రసిద్ధిచెందాడు. అంతేకాక ఆ చిత్రంలో శ్రీలంక జాతీయ జెండాను మోస్తూ తిరిగే సీన్లు కూడా ఉండడంతో తమిళుల్లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి.
దీంతో సోషల్ మీడియాలో భారీ ఎత్తున విజయ్ సేతుపతి షేమ్ ఆన్ యూ.. ఆ సంఘటనలు నీకు గుర్తులేవా.. అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. శ్రీలంకలో కొన్ని దశాబ్దాలుగా తమిళులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తమిళులు హక్కుల కోసం పోరాడిన వారిని శ్రీలంక సైన్యం ఊచకోత కోసింది. అత్యంత దారుణంగా హతమార్చింది. అలాంటి శ్రీలంక ఆటగాడి పాత్రలో ఆ దేశ జెండాను గుండెలపై మోస్తూ ఓ తమిళుడు నటించడం సహించలేని కొందరు విజయ్ సేతుపతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఊహించని ఈ వ్యతిరేకతకు కంగుతిన్న మేకర్స్ దీనికి ఎలా స్పందించాలో తెలియక తికమక పడుతున్నారు.