సారథి న్యూస్, మెదక్: అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మెదక్ జిల్లాను ముందంజలో నిలపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి కోరారు. అందుకోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేయాలని కోరారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెదక్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, రైతు వేదికలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణాల్లో తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్లను వినియోగించుకోవాలన్నారు.
కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో డంపింగ్ యార్డులను జులై 7వ తేదీ నాటికి పూర్తిచేయాలని, అలాగే జులై 30వ తేదీలోగా శ్మశాన వాటికలను కంప్లీట్ చేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో హనోక్, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, జిల్లా స్థాయి అధికారులు, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.