Breaking News

మెదక్​ నంబర్ ​వన్​గా నిలవాలె

మెదక్​ నంబర్ ​వన్​గా నిలవాలె

సారథి న్యూస్, మెదక్: జిల్లాను పారిశుద్ధ్యంలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచేలా లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​ రావు కోరారు. సోమవారం సిద్దిపేట నుంచి మెదక్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకుంఠధామాలు, రైతు వేదికలు, డంపింగ్​యార్డులు, రైతు కల్లాలపై ఆరాతీశారు. ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో పనుల పురోగతి బాగుందని, మరికొన్ని మండలాల్లో చాలా వెనకబడి ఉన్నారని అన్నారు. ఒకరిద్దరు సర్పంచ్​లతో జిల్లా వెనకబడితే ఉపేక్షించేదిలేదని, సర్పంచ్ లను తొలగించైనా పనులను పూర్తిచేయిస్తామని మంత్రి స్పష్టంచేశారు.

జిల్లాలో రైతువేదికల నిర్మాణాలు ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయించాల్సిన బాధ్యత సంబంధిత ఏఈవోలదేనని మంత్రి సూచించారు. కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. మెదక్ జిల్లాను పారిశుద్ధ్యం విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో సెగిగ్రేషన్ షెడ్స్ కంప్లీట్​ అయ్యాయని అన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తన స్వగ్రామమైన హవేళి ఘనపూర్ మండలం కూచన్​పల్లిలో సొంత డబ్బుతో రైతు వేదిక నిర్మించేందుకు గతంలోనే హామీ ఇచ్చానన్నారు. పనులు కూడా పూర్తి చేయనున్నట్లు వివరించారు. ఈ విషయమై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి తన సొంత నిధులతో రైతువేదిక నిర్మించడం ఎంతో అభినందనీయమన్నారు. దుబ్బాక, అందోల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చంటి క్రాంతికిరణ్, భూపాల్ రెడ్డి, అడిషనల్​ కలెక్టర్ నగేష్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో హనోక్ పాల్గొన్నారు.