సారథి న్యూస్, మెదక్: పాత్రికేయుల జీవితాలను చిదిమివేస్తున్న కరోనా నుంచి భద్రత కల్పించాలనే డిమాండ్‌తో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరాస్తాలో జర్నలిస్టులు సత్యాగ్రహం నిర్వహించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూ జే (ఐజేయూ) మెదక్ జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి, యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డీజీ శ్రీనివాస్‌శర్మ, రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యుడు మిన్పూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 12 మంది జర్నలిస్టులు కరోనా కాటుకు బలైపోగా, 1100 మంది మీడియా సిబ్బందికి, 2,600 మంది వారి కుటుంబసభ్యులకు కరోనా సోకిందన్నారు.
మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయక చర్యలు అందకపోవడం విచారకరమన్నారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ప్రభుత్వ సహాయం అందించాలని, కోవిడ్ వారియర్స్ గా నిలిచిన జర్నలిస్టులకు రూ.50లక్షల బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి నాగరాజు, ఈసీ మెంబర్ నగేష్, మల్లేష్, మోహన్ రాజ్, శ్యాం, సుమన్, శివశరణ్ సింగ్, బాలకిషన్, గిరి జనార్ధన్, రఘు, శేఖర్, కార్తీక్, వెంకటేష్ , రాహుల్ , శ్రీనివాస్ మురళ, నరేష్ , సిద్దు, విజయ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.