Breaking News

ఒరిగిన పోరు కెరటం

మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహా మృతి
  • ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహా ఇకలేరు
  • శానససభలో ప్రజల తరఫున తనదైన గళం
  • చివరి శ్వాసదాకా ప్రజా ఉద్యమాల్లోనే.. నిజాయితీయే ఆస్తి

సారథి న్యూస్​, ఇబ్రహీంపట్నం: పోరు కెరటం నెలకొరిగింది.. ప్రజాగొంతుక మూగబోయింది.. దళిత కిరణం ఆరిపోయింది.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత మస్కు నర్సింహా ఇక లేరు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చివరకు హెల్త్​ కండీషన్​ విషమించడంతో చనిపోయారు. ఆయనకు భార్య అరుణ, ఇద్దరు కుమారులు కిరణ్, చంటి ఉన్నారు. ఆయన స్వగ్రామం రంగారెడ్డి యాచారం మండలం చిన్నతుల్ల. పేద దళిత కుటుంబంలో మస్కు పెద్ద పెంటయ్య, పెద్ద లక్షమ్మ దంపతుల మూడవ సంతానంగా నర్సింహ పుట్టారు. వామపక్ష ఉద్యమాల వైపు అడుగులు వేశారు. ఎస్ఎఫ్​ఐ, డీవైఎఫ్ఐ, కేవీపీఎస్​ వంటి ప్రజాసంఘాలకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన వ్యవసాయకార్మిక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.

ప్రజాఉద్యమాల్లో అన్నీతానై..

మస్కు నర్సింహా సీపీఎంలో కార్యకర్త నుంచి నాయకుడి స్థాయికి ఎదిగారు. 25 ఏళ్ల వయసులోనే ఎంపీటీసీగా ఎన్నికై, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో సీపీఎం తరఫున ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి నర్రా రవికుమార్​పై 12,791 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డాక్టర్​ వైఎస్​ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజాసమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గ్రామగ్రామానికి కృష్ణాజలాలను అందించేందుకు ఊరూరా ఉద్యమం నిర్వహించి సాధించారు. మాల్​ నుంచి హైదరాబాద్​ వరకు నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ కోసం వేలాది మందితో హైదరాబాద్​ నుంచి పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇబ్రహీంపట్నంలోనే ఇళ్లస్థలాల పంపిణీ ఆయన నాయకత్వంలోనే జరిగింది. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, హయత్ నగర్ ప్రాంతాల్లో 10 వేల ఎకరాలకుపైగా భూములు పంచారు. రంగారెడ్డి జిల్లాలో అంటరానితనం, రెండు గ్లాసుల పద్ధతి, ఆలయ ప్రవేశం, ఎస్సీ హాస్టళ్ల ఆధునికరణ, వసతుల కల్పన కోసం సైకిల్​ యాత్ర వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కార్మికవర్గానికి నాయకత్వం వహించి ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగారు.

నిజాయితీ.. ఆయన ఆస్తి

మస్కు నర్సింహా దళిత కిరణంగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఆస్తిపాస్తులు నిలువెత్తు నిజాయితీ మాత్రమే. సొంతిల్లు, వివిధ సందర్భాల్లో 70 కేసులు మాత్రమే మిగిలాయి. నిరాడంబరంగా, నిజాయితీగా బతికిన మలితరం కమ్యూనిస్టు నేతగా మస్కు నర్సింహా పేరు సంపాదించుకున్నారు. ఆయన మృతిపట్ల సీపీఎం జిల్లా కార్యదర్శి డి.రాంచందర్​, వి.సామేలు, మధుసూదన్​రెడ్డి, జగదీశ్​, జగన్​, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దయ్యాల జగదీశ్​, కార్యదర్శి చంద్రమోహన్​, ఉపాధ్యక్షుడు దయ్యాల కిషన్​, సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ ​నాయకులు సంతాపం తెలిపారు.