- మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్
సారథి, న్యూస్, మహబూబ్ నగర్: మహిళలు ఆర్థికంగా ఎదగాలని, అందుకోసమే మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీలేని లోన్లు ఇస్తోందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పాలమూరు జిల్లా స్వయం సహాయక సంఘం మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు ఎగ్జిబిషన్ ను శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే మహబూబ్ నగర్ లో వెయ్యి ఎకరాల స్థలంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఫుడ్ పార్కులో లోకల్ మేడ్ విక్రయాలకు స్థలం కేటాయిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ‘మహా’ (మహబూబ్ నగర్ మహిళా ప్రొడక్ట్స్) పేరును నామకరణం చేసి లోగోను ఆవిష్కరించారు. కలెక్టర్ ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ.. మన ఉత్పత్తులను జిల్లాకే పరిమితం చేయకుండా ప్రపంచానికి పరిచయం చేసేలా కృషిచేయాలని పిలుపునిచ్చారు. మామిడి ఒరుగు మాదిరిగానే వచ్చే సీజన్లో సీతాఫలం యూనిట్ హన్వాడ, గండీడ్, నవాబుపేట్ మండలాల్లో ఏర్పాటు చేస్తామన్నారు.
జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందని, మహిళలు మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, డీఆర్డీవో వెంకట్ రెడ్డి, బ్యాంక్ మేనేజర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగరాజు కుమార్ పాల్గొన్నారు.