Breaking News

మహాలయపక్షం విశిష్టత.. తెలుసా?

మహాలయపక్షం విశిష్టత ఏమిటో తెలుసా..?

భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం మహాలయ పక్షం. ఈ పక్షంలో పితరులు అన్నాన్ని, ప్రతిరోజూ జలాన్ని కోరుతానని ప్రతీతి. తండ్రి చనిపోయిన తిథి రోజున, మహాలయ పక్షంల్లో పితృతర్పణాలు, యథావిధిగా శ్రాద్ధవిధులు నిర్వహిస్తే పితృదేవతలు ఏడాదంతా తృప్తిచెందుతారని చెబుతుంటారు. వంశాభివృద్ధి జరిగి ఉత్తమ గతిని పొందుతారట. ఈ విషయాలన్నీ నిర్ణయ సింధువు, నిర్ణయ దీపికా గ్రంథాల్లో పేర్కొన్నారు. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదం, కృష్ణపక్షం పితృపదం, అదే మహాలయపక్ష. మహాలయమంటే.. ‘మహాన్ ఆలయః, మహాన్‌లయః మహల్ అలం యాతీతివా’ అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయం, పితృదేవతల యందు మనసు లీనమగుట. పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందడం అని అర్థం. అమావాస్య అంతరార్థం.. ‘అమా’ అంటే ‘దానితో పాటు’, ‘వాస్య’ అంటే వహించడం. చంద్రుడు, సూర్యుడిలో చేరి సూర్యుడితో పాటు వసించే రోజు కాబట్టి అమావాస్య అన్నారు. భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణాలకు ఎదురుచూస్తూ ఉంటారని ధర్మగ్రంథాల్లో చెప్పారు. మహాలయ పక్షంలో వరుసగా 15రోజులు పితృదేవతలు పూజలకు ఉద్దేశించినవి.
పితృదోషం ఒక శాపం
పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ, తల్లితండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత దోషాలు కారణమవుతాయి. జాతకచక్రంలో ఇలాంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల కారణంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి.
మహాలయ అమావాస్య విశిష్టత
భాద్రపద బహుళ పాఢ్యమి నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షం పితృ రుణం నుంచి ముక్తిపొందడం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృగణాల శ్రాద్ధకర్మ గౌరవప్రదంగా చేయడం సంతానం తప్పనిసరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల వద్దకు వస్తారు. ప్రతి మాసంలోనూ అమావాస్య, పితరుల పుణ్యతిథిగా భావించినా మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యం ఉంటుంది.
ఆదర పూర్వకంగా శ్రాద్ధకర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య, ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేలా ఆశీర్వదిస్తారు. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది, కానీ ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయ ఫలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. మహాలయ పక్షంలో ఏరోజు శ్రాద్ధకర్మ చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇవీ ఫలితాలు
– పాఢ్యమి తిథి రోజు శ్రార్ధం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
– విధియలో శ్రార్ధం పెడితే సంతాన ప్రాప్తి.
– తదియలో శ్రార్థం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది.
–చవితి రోజు శ్రార్ధం పెడితే పగవారు(శత్రువులు)లేకుండా చేయును.
–పంచమి రోజున శ్రార్ధం పెడితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
– షష్టి రోజు ఇతరులకు పూజ్యనియులుగా చేయును.
– సప్తమి రోజు పరలోకంలో దేవగోష్టికి నాయకుడిగా చేయును.
– అష్టమి రోజున మంచి మేధస్సును చేకూర్చును.
– నవమి మంచి భార్యను సమకూర్చిను. గయ్యాళియైన భార్య కూడా బుద్ధిమంతురాలిని చేయును. మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును.
– దశమి తిథి రోజు కోరికలను నెరవేర్చును.
– ఏకాదశి రోజున సకల వేదా, విద్యాపారంగతులను చేయును.
– ద్వాదశి రోజున స్వర్ణాలు, స్వర్ణాభరణాలు సమకూర్చును.
– త్రయోదశి రోజున సత్సంతానాన్ని, మేధస్సు, పశు, పుష్టి, సమృద్ధి , దీర్ఘఆయుష్షు మొదలగు సకల సౌభాగ్యాలు సమకూర్చును.
– చతుర్దశి తిథి రోజున వస్త్రం లేక్ అగ్ని(ప్రస్తుత కాలంలో రైలు, మోటారు వాహనములు విపత్తు వల్ల) వీని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహలయ శ్రార్ధం చేయాలని పేర్కొన్నారు. అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది.
– అమావాస్య రోజు సకల అభిష్టాలు సిద్ధిస్తాయి.
– పాఢ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలోని లోపాలను నివృత్తి చేసి పరి పూర్ణత చేకూర్చును.

ప్రతి ఏడాది చేసే శ్రాద్ధం కన్నా మహాలయంలోనైనా చేసి తీరాలి. ఆర్థికభావం ద్వారా విద్యుక్తంగా శ్రాద్ధకర్మలు చేయలేకపోతే, పితృపక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయొచ్చు. అది కూడా వీలు గాకపోతే గోవుకు గ్రాసం పెట్టొచ్చు. అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చుని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకెత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖసంతోషాలు, పరలోకం లో ఉత్తమ గతులు లభిస్తాయని పండింతులు చెబుతున్నారు.

:: దిండిగల్ ​ఆనంద్ శర్మ, సీనియర్ జర్నలిస్టు
సెల్​నం:96660 06418