సారథి న్యూస్, హైదరాబాద్: దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంచేశారు. కోవిడ్ – 19 ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్యను హైలైట్ చేయడం ద్వారా ప్రజల్లోని భయాందోళనను పారదోలాలని ప్రధాని సూచించారు. బుధవారం రెండవ రోజు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆన్ లాక్ 1.0 అనంతర పరిస్థితులపై ప్రధాని సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వదంతులపై సృష్టత ఇవ్వాల్సిందిగా ప్రధానిని కోరారు. దీనిపై స్పందించిన ప్రధాని దేశంలో లాక్ డౌన్ దశ ముగిసి.. ఆన్ లాక్ దశ మొదలైందన్నారు. దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఉండదన్నారు 1.0 నడుస్తుందని ఆన్ లాక్ 2.0 ఎలా అమలు చేయాలన్న దానిపై చర్చించుకోవాలని సూచించారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తూ.. తెలంగాణలో కరోనా ప్రస్తుత అదుపులోనే ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న ఈ విషయంలో విజయం సాధిస్తామని నమ్మకం తమకు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయని అన్నారు. కొద్దిరోజుల్లోనే వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు(ఎంపీ) కె.కేశవరావు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.