ఢిల్లీ: మనదేశ శక్తిని ప్రపంచానికి ప్రపంచానికి చాటాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానిమోడీ శనివారం ఢిల్లీలోని ఎర్రకోటపై ఏర్పాటుచేసిన మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటుంది. మనం కూడా కరోనాతో రాజీలేని పోరాటం చేస్తున్నాం. కరోనాపై పోరాటంలో శక్తివంచన లేకుండా కృషిచేస్తున్న కరోనా వారియర్స్‌కు (డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది, పారిశుద్ధ్యకార్మికులు, పోలీసులు) శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రక్షణ దళాలు మనల్ని రక్షిస్తున్నాయి. కరోనా ఒక్కటే కాదు.. వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చాయి. కేంద్రం, రాష్ట్రాలు ఏకతాటిపై విపత్తులను ఎదుర్కొంటున్నాయి.
చైనా దిగుమతులపై నిషేధం
‘చైనాతోపాటు ఇతర దేశాల వస్తువుల దిగుమతిని నిషేధించాలి. మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలి. భారత్ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అని నిరూపిద్దాం. భారత వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేద్దాం.’ అని ప్రధాని మోడీ అన్నారు.
వోకల్ ఫర్ లోకల్
‘భారత్ తయారీ వస్తువులను ప్రపంచం ఆదరించేలా ఉత్పత్తి చేద్దాం. ఒకనాడు భారత వస్తువులు అంటే విశ్వవ్యాప్తంగా గౌరవం ఉండేది. మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేద్దాం. భారత్ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అన్న గౌరవాన్ని తెచ్చుకుందాం. మన వస్తువులను మనమే గౌరవించకుంటే ప్రపంచం ఎలా గౌరవిస్తుంది. పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. నాలుగు నెలల్లో స్వయం సమృద్ధి సాధించి ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నాం. మన యువతకు కొత్త అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను నిలబెట్టుకుందాం’ అని మోడీ అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ సాధించాలి
‘75 ఏళ్ల తర్వాత కూడా భారత్ స్వయం సమృద్ధి సాధించలేకపోయింది. ఈ క్షణం నుంచి స్వయం సమృద్ధికి బలమైన సంకల్పంతో ముందుకువెళ్లాలి. ప్రపంచం ఇప్పుడు పరస్పర ఆధారితం.. ఏ ఒక్కరూ ఏకాకిగా మనలేరు. భారత్ అంటే కేవలం క్రమశిక్షణ మాత్రమే కాదు.. ఉన్నత విలువలతో కూడిన జీవనం. ప్రపంచ కల్యాణానికి మనవంతు కూడా నిరంతరం చేస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్ అనేది కేవలం నినాదం మాత్రమే కాదు. ఆత్మనిర్భర్ భారత్ కోసం మనందరి సంకల్పం కావాలి. దేశ యువత ఆత్మవిశ్వాసంతో ఆత్మనిర్భర్ భారత్ సాధించాలి’ అని మోడీ పిలుపునిచ్చారు.
ఎర్రకోటపై ఏడోసారి
ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించడం ఇది వరుసగా ఏడోసారి కావడం విశేషం. కరోనా నేపథ్యంలో 150 మందిని మాత్రమే వేడుకలకు అనుమతించారు. ఈ సందర్భంగా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లుచేశారు. ఇక, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిందే.. శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచారు. ఈ వేడుక సందర్భంగా ఎర్రకోట త్రివర్ణ శోభితమైంది. కరోనా దృష్ట్యా వేడుకల్లో వ్యక్తిగత దూరం ఉండేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట ప్రాంగణంలో కుర్చీల మధ్య రెండు గజాల దూరం ఉండేలా ఏర్పాట్లుచేశారు.