సారథి న్యూస్, వెల్దండ: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ తహసీల్దార్ జి.సైదులు సూచించారు. గ్రామాల్లో పాత మట్టిమిద్దెల్లో నివాసం ఉంటున్నవారు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా ముందస్తుగా సురక్షిత నివాస ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వర్షాలకు గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత వీఆర్వో, వీఆర్ఏలకు తెలియజేయాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉంటారని స్పష్టంచేశారు. ఇళ్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారు ప్రభుత్వ స్కూళ్లలో నివాసం ఉండాలని, అలాంటి వారెవరైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని తహసీల్దార్ కోరారు.
గ్రామశివారులో ఉన్న చెరువులు, కుంటలకు గండ్లుపడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ప్రజలు వర్షాలకు ఇబ్బందిపడకుండా ప్రజాప్రతినిధులు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిందని, అందుకు అనుగుణంగా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో ప్రజలకు ప్రజాప్రతినిధులు, యువకులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని తహసీల్దార్ సైదులు కోరారు.