Breaking News

భారీవర్షం.. నీట మునిగిన వనపర్తి

భారీవర్షాలు.. నీట మునిగిన వనపర్తి

  • పట్టణంలో భారీవర్షం..
  • లోతట్టు కాలనీలు జలమయం
  • వరద నీటికి ఉప్పొంగిన తాళ్లచెరువు
  • అక్రమ వెంచర్లు.. నిర్మాణాలే కారణం
  • 20ఏళ్ల క్రితం ఇదే పరిస్థితి..

సారథి న్యూస్, వనపర్తి: అక్రమ నిర్మాణాలు, అధికారుల నిర్లక్ష్యం వెరసి.. భారీ వర్షాలకు వనపర్తి నీటమునిగింది. మంగళవారం రాత్రి కురిసిన వానలకు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తాళ్లచెరువు వరద నీటితో పోటెత్తడంతో రామాటాకీస్, శ్వేతానగర్, శంకర్ గంజ్, ప్రభుత్వ ఆస్పత్రి, చింతల హనుమాన్ ఆలయం, సుభాష్ వాడలోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి రామాటాకీస్, శంకర్​గంజ్​లో వాగునీరు రోడ్డుపై మోకాళ్లు లోతు మేర ప్రవహిస్తోంది. ఈ ప్రాంతంలో కర్ర కోత మిషన్ల నుంచి పెద్ద సంఖ్యలో కర్రమొద్దులు, కలప నీటిలో మునిగిపోయింది. ఇదిలాఉండగా, 20 ఏళ్ల క్రితం తాళ్లచెరువు వాగు పొంగి రామాటాకీస్ వద్ద ఇద్దరు వ్యక్తులు నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. అయినప్పటికీ రెండు దశాబ్దాలుగా ఇప్పటివరకు అధికారులు వరదనీరు పారుదలకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. నీట మునిగిన ప్రాంతాలను మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఇతర అధికారులు సందర్శించారు. తాళ్లచెరువు పక్కన అక్రమంగా ప్లాట్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు నందిమల్ల శారద, నందిమల్ల అశోక్, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వనపర్తిలో వరద నీటి అవస్థలు