- టీ20 ప్రపంచకప్ ప్రస్తావన లేకుండానే..
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో భారత్ జట్టు పూర్తిస్థాయి షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌లు, మూడు వన్డేలకు సంబంధించిన తేదీలు, వేదికలను వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్ 11తో ఈ పర్యటన మొదలవుతుంది. మధ్య మధ్య బ్రేక్‌లతో వచ్చే ఏడాది జనవరి 17తో ముగుస్తుంది. ఓవరాల్‌గా అక్టోబర్, నవంబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ ప్రస్తావన లేకుండానే తమ ఆరునెలల సమ్మర్ షెడ్యూల్‌ను సీఏ ప్రకటించడం గమనార్హం. దీంతో మెగా ఈవెంట్‌ను రద్దు లేదా వాయిదా వేస్తారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. భారత్–ఆసీస్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 11 (బ్రిస్బేన్), 14 (కాన్బెర్రా), 17న (అడిలైడ్) వరుసగా మూడు టీ20లు జరుగుతాయి. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉన్నా.. సీఏ షెడ్యూల్లో స్పష్టత ఇవ్వలేదు. ఆస్ట్రేలియాలో పర్యటించే టీమిండియా కచ్చితంగా ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
అడిలైడ్‌లో డే నైట్ టెస్ట్
కొద్ది విరామం తర్వాత కోహ్లీసేన మరోసారి ఆసీస్‌కు వెళ్తుంది. ఇందులో నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. బ్రిస్బేన్‌లో తొలి టెస్ట్ (డిసెంబర్ 3–7), అడిలైడ్ (11–15)లో రెండో టెస్ట్ ఆడనుంది. సీఏ విజ్ఞప్తి మేరకు దీనిని డే నైట్ టెస్ట్‌గా నిర్వహించనున్నారు. ఆసీస్‌లో పింక్ బాల్‌తో ఇదే తొలి టెస్ట్ కావడం విశేషం. చివరి రెండు టెస్ట్‌లకు మెల్‌బోర్న్ (డిసెంబర్ 26–30), సిడ్నీ (జనవరి 3–7) ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ సిరీస్‌తో సీఏకు 300 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా. టెస్టు సిరీస్ తర్వాత ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలుకానుంది. వచ్చే ఏడాది జనవరి 12న పెర్త్‌లో తొలి వన్డే, 15న మెల్‌బోర్న్‌లో రెండో వన్డే, 17న సిడ్నీలో మూడో వన్డేతో పర్యటన ముగుస్తుంది. ఆ వెంటనే మిథాలీరాజ్ నేతృత్వంలోని ఇండియా మహిళల జట్టు కూడా ఆసీస్‌లో పర్యటిస్తుంది. జనవరి 22 నుంచి 28 వరకు కంగారులతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.