Breaking News

బౌలర్లు రోబోలవుతారు


లాహోర్: బంతి మెరుగుపర్చేందుకు ఉమ్మిని నిషేధించడం బౌలర్లకు శాపంగా పరిణమిస్తుందని పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ అన్నాడు. దీనివల్ల బౌలర్లు రోబోలుగా తయారవుతారన్నాడు. బంతి స్వింగ్ కాకపోతే బ్యాట్స్​మెన్ ఆధిపత్యం మరింత పెరుగుతుందని వెల్లడించాడు. ‘బంతిపై ఉమ్మి రుద్దకపోతే కష్టమే. ఎందుకంటే ఇంగ్లండ్, న్యూజిలాండ్​ లాంటి చల్లటి ప్రాంతాల్లో బౌలర్లకు అంత త్వరగా చెమటపట్టదు. అప్పుడు దేనిని వాడాలి. నా కెరీర్ మొత్తంలో నేను ఉమ్మి రుద్దే స్వింగ్​ను రాబట్టాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మిని ఎందుకు నిషేధించారో నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రత్యామ్నాయం చూపెట్టాలి కదా. కనీసం వ్యాజ్​లైన్లు వాడడానికైనా అనుమతి ఇవ్వాలి. ఎంత మేరకు దానిని ఉపయోగించాలో కూడా చెబితే సరిపోతుంది. ఏదీ లేకుండా కేవలం చెమట ద్వారానే బంతిని మెరుగుపర్చడం అసాధ్యం’ అని అక్రమ్ వ్యాఖ్యానించాడు.

ఉష్ణదేశాల్లో చెమట ఎక్కువగా వాడడం వల్ల బంతి తడిగా మారి మరింత ఇబ్బందులు ఎదురవుతాయన్నాడు. ఓవరాల్​గా ఒకటి, రెండు సిరీస్​లు జరిగితే గానీ ఉమ్మి నిషేధంపై స్పష్టమైన ప్రభావం తెలియదన్నాడు. మ్యాచ్ బ్యాట్స్​మెన్​కు అనుకూలంగా మారొద్దనుకుంటే బాల్ ట్యాంపరింగ్​కు అనుమతి ఇవ్వాలని సూచించాడు.