Breaking News

బౌలర్లను ధోనీ అదుపులో పెట్టాడు

న్యూఢిల్లీ: భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన మొదట్లో ధోనీ.. బౌలర్లను చాలా అదుపులో పెట్టుకున్నాడని మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఆ తర్వాత క్రమంగా బౌలర్లపై నమ్మకం పెంచుకున్నాడన్నాడు. అదే ఇప్పుడు అద్భుత ఫలితాలను ఇస్తోందన్నాడు. ‘2007లో ధోనీ అతిపెద్ద బాధ్యతను తీసుకున్నాడు. అప్పుడు చాలా ఉత్సాహంగా కనిపించాడు. అది పెద్ద బాధ్యత అని తెలిసినా ఏనాడూ వెనుకడగు వేయలేదు. చాలా అంశాల్లో మార్పులు తీసుకొచ్చాడు. జట్టు సమావేశాలను ఐదు నిమిషాల్లోనే ముగించేవాడు. 2007 నుంచి 2013 వరకు ఇదే వరుస. అయితే కొత్తగా వచ్చిన బాధ్యతలతో బౌలర్లపై పట్టు సాధించేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేసేవాడు. వికెట్ కీపింగ్ నుంచి బౌలింగ్ వరకు తన అదుపులో ఉండాలని భావించేవాడు. ఒక్కసారి భారత్ విజయాల బాట పట్టాక.. అతనిలో మార్పు కూడా మొదలైంది. చాంపియన్స్ ట్రోఫీ వరకు పూర్తిగా పరిణతి సాధించాడు. ఆ సమయంలో బౌలర్లకు స్వేచ్ఛ ఇచ్చాడు. వాళ్లను నమ్మడం మొదలుపెట్టాడు. బౌలర్లు గాడిలో పడ్డాక అతను కూల్గా మారిపోయాడు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత స్లో బౌలర్లను, స్పిన్నర్లను నమ్మాడు. కీలక సమయంలో స్పిన్నర్లను దించి వికెట్లు పడగొట్టాడు. అదే మంత్రంతో జట్టుకు అనేక విజయాలు అందించాడు’అని ఇర్ఫాన్ వివరించాడు.

ఏకైక కెప్టెన్ అతనే..
గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్కు దూరంగా ఉంటున్న 38 ఏళ్ల మహీ.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాలను ఎన్నో సాధించాడు. 2007 నుంచి 2016 వరకు వన్డే, టీ20 ఫార్మాట్లో, 2008 నుంచి 2014 వరకు టెస్ట్ ఫార్మాట్లో టీమిండియాను నడిపించిన ధోనీ.. ఐసీసీలో ఉన్న అన్ని ట్రోఫీలను సాధించిన ఏకైక కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ధోనీ కెప్టెన్సీలోనే టీమిండియా.. 2007 టీ20 ప్రపంచకప్, 2010, 2016 ఆసియా కప్, 2011 వన్డే వరల్డ్కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.