Breaking News

బోర్డర్​లో టెన్షన్​.. టెన్షన్​

న్యూఢిల్లీ: ఇండియా- చైనా సరిహద్దుల్లో టెన్షన్​ వాతావరణం నెలకొంది. ఇరుదేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అసువులు బాసినట్లు తెలుస్తోంది. మొదట ఇద్దరు జవాన్లు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. 43 మంది చైనా సైనికులు చనిపోయినట్లు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే మరణాలపై చైనా అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం తమ వైపు కూడా నష్టం జరిగిందని మాత్రమే ప్రకటించింది. లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్‌, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్​, సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు అమరుడయ్యారు. ఈ నేపథ్యంలో లదాఖ్‌ ప్రాంతంలో నెలకొన్న ఘర్షణ నేపథ్యంలో స్థానిక పరిస్థితిని వివరించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ప్రధానితో జరిగిన సమావేశంలో ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవనే, సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి జైశంకర్‌ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో ఆయనను కలుసుకుని బోర్డర్​లో నెలకొన్న పరిస్థితిపై సంప్రదింపులు జరిపారు.