- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఇండియా, చైనా మధ్య బోర్డర్లో తలెత్తిన గొడవను క్లియర్ చేసేందుకు తాను సిద్ధమని, దాని కోసం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మోడీ ఈ విషయంపై మాట్లాడే మూడ్‌లో లేరని ఆయన చెప్పారు. గురువారం ఆయన వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. లద్దఖ్లోని ప్యాంగాంగ్ లేక్ ఏరియాలో చైనా బలగాలు భారత్ భూభాగంలోకి దూసుకొచ్చేందుకు యత్నించడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య తాను మధ్యవర్తిత్వం చేస్తానంటూ బుధవారం ట్రంప్ ట్వీట్ చేశారు. దానికి కట్టుబడి ఉన్నానని మరోసారి గురువారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
చైనా ఇష్యూ గురించి తాను ప్రధానిమోడీతో ఫోన్ లో మాట్లాడానని, ఆ సమయంలో ఆయన మూడ్ ఏం బాగోలేదని, చైనా తీరుపై అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. కాగా, చైనాతో తలెత్తిన ఈ సమస్యను సామరస్యపూర్వకంగా చర్చలతోనే పరిష్కరించుకుంటామని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు చైనా కూడా సరిహద్దులో అంతా శాంతియుతంగానే ఉందని ప్రకటన చేసింది. భారత్, చైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేందుకు మంచి వాతావరణం ఉందంటూ చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.
మోడీ, ట్రంప్ మధ్య ఎలాంటి చర్చ లేదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవల ఎలాంటి చర్చలు జరగలేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. భారత్, చైనా మధ్య సరిహద్దల్లో తలెత్తిన ప్రతిష్టంభన తొలగించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు మోడీకి ఫోన్ చేశానని, ఆయన మూడ్ బాగోలేదని ట్రంప్ చెప్పిన నేపథ్యంలో అధికారులు దీనిపై స్పందించారు.
మోడీ, ట్రంప్ చివరి సారి ఏప్రిల్ 4న మాట్లాడుకున్నారని, హైడ్రా క్సీక్లోర్వోకిన్ గురించి చర్చించుకున్నారని చెప్పారు. చైనా బలగాలు భారత భూభాగంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో రెండు దేశాల మధ్య తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ బుధవారం ట్వీట్ చేశారు. అదే అంశంపై గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా చెప్పారు. కాగా.. చైనాతో తలెత్తిన ఈ సమస్యను తాము చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఇప్పటికే భారత్ ప్రకటించింది. తాము కూడా చర్చల ద్వారానే పరిష్కారం తీసుకొస్తామని చైనా విదేశాంగశాఖ కూడా చెప్పింది. ట్రంప్ గతంలో కూడా మధ్యవర్తిత్వం వహించి కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పగా.. మన దేశం దానికి ఒప్పుకోలేదు.