Breaking News

బోనాలు లేనట్లే..

సారథి న్యూస్, హైదరాబాద్​: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఈ ఏడాది బోనాల ఉత్సవాలను సాదాసీదాగానే జరుపుకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి.. ఇప్పటికే చాలా ఆలయాలు భక్తుల దర్శనానికి నోచుకోవడం లేదు. అర్చకులే నిత్యపూజల తంతును కొనసాగిస్తున్నారు. కంటైన్​మెంట్​ జోన్లలో అయితే గుడి తలుపులు తెరుచుకోవడం లేదు. అయితే జూన్​ 25 నుంచి ప్రారంభం కావాల్సిన గోల్కొండ బోనాలు, జులై 12న సికింద్రాబాద్ మహంకాళి, జులై 19న హైదరాబాద్ బోనాలు ఉండబోవని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌‌ర‌‌ణ్ రెడ్డి స్పష్టంచేశారు. ఆయా గుడుల పూజారులే అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం ఈనెల 8వ తేదీ నుంచి ఆలయాల్లో దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో భౌతిక దూరం ఉండేలా, సోడియం హైపోక్లోరైడ్‌‌తో గుడుల ప్రాంగణాన్ని కడగాలని నిర్ణయించారు. ఆలయ ముఖద్వారంలోనే శానిటైజర్స్‌‌ అందుబాటులో ఉంచనున్నారు.