- ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకానికి శ్రీకారం
- ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’కి విశేష స్పందన
సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలోని బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకాన్ని సెప్టెంబర్ 1న ప్రారంభించనున్నారు. గతంలో గిరిజనులకు మాత్రమే వర్తించే ఈ పథకం ఇక నుంచి అందరికీ వర్తించనుంది. పథకంలో భాగంగా రాగిపిండి కేజీ, బెల్లం 250 గ్రాములు, చిక్కి 250 గ్రాములు, ఎండు ఖర్జూరం 250 గ్రాములు, సజ్జ లేదా జొన్నలు 250 గ్రాములు, అటుకులు కేజీ చొప్పున ఇవ్వనున్నారు. ఈ స్కీం ద్వారా ఆరునెలల నుంచి 36 నెలల్లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తారు. బాలామృతం 2.5 కేజీలు, ప్రతినెలా గుడ్లు 25, ఐదులీటర్ల పాలు పంపిణీ చేస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 13.5 లక్షల మంది చిన్నారులు లబ్ధిపొందనున్నారు.
‘అంగన్‌వాడీ పిలుస్తోంది’ విశేష ఆదరణ
ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ స్కూళ్లలో నిర్వహిస్తున్న ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ వరకు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రంలోనే ఇంగ్లిష్లో పాఠాలు చెబుతారు. ప్రతి అంగన్ వాడీ కేంద్రంలో ఆటవస్తువులు, వసతులు, పౌష్టికాహారం.. తదితర వసతులను సమకూర్చుతారు. ఈ విషయాలను తల్లిదండ్రులకు ఇంటింటికి వెళ్లి అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి మంచి స్పందన లభించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించేందుకు ఆసక్తి చూపుతున్నారని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శారద భాగ్యరేఖ వివరించారు. ఇక్కడ చదివిన పిల్లలను నేరుగా ప్రభుత్వ స్కూలుకు 1వ తరగతికి రెఫర్ చేస్తామని ఆమె చెప్పారు.