Breaking News

బస్సులు, ఆటోలు నడుస్తయ్​

బస్సులు, ఆటోలు నడుస్తయ్​
  • క్లబ్​లు, పబ్​లు, జిమ్ లు బంద్​
  • కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి
  • హైదరాబాద్​ మెట్రోరైల్​ బంద్
  • సెలూన్లు తెరుచుకోవచ్చు
  • ఈ-కామర్స్‌ ను అనుమతిస్తున్నం
  • ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్​ నిర్ణయం

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో మే 31 వరకు లాక్‌ డౌన్‌ కొనసాగిస్తామని సీఎం కేసీఆర్​ స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, ఆటోలు నడుస్తాయని వెల్లడించారు. కంటైన్​మెంట్​ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్‌ జోన్లుగా ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన లాక్‌ డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సడలింపులు, కేంద్రం ఆర్థిక ప్యాకేజీపై సీఎం కేసీఆర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ మార్గదర్శకాలను వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..1452 కుటుంబాలు మాత్రమే కంటైన్​ మెంట్​ ఏరియాలో ఉన్నాయి. ప్రభావం ఉన్న పరిసరాల్లోనే లాక్‌ డౌన్‌ అమలులో ఉంటుంది. పూర్తిగా పోలీసు పహారాలోనే ఈ ఏరియా ఉంటుంది. కరోనాకు వ్యాక్సిన్‌ రేపోమాపో వచ్చే పరిస్థితి లేదని ప్రపంచం అంగీకరించింది. కరోనాతో కలసి జీవించడం నేర్చుకోవాలి. బతుకుదెరువు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు పోవాలి. జీహెచ్​ఎంసీ పరిధిలోని కంటైన్​మెంట్​ ఏరియాలు కాకుండా మిగతా ప్రాంతాల్లో సరి, బేసి పద్ధతిలో షాపులు తెరుచుకోవచ్చు. ఇక్కడ ఉండే కుటుంబాలకు నిత్యావసరాలను ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ప్రతిఒక్కరూ మాస్క్​లు ధరించాలి. లేకపోతే రూ.వెయ్యి ఫైన్ వేస్తారు. భౌతిక దూరాన్ని కూడా పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత అత్యంత ముఖ్యం. రేపటి నుంచి అన్నిరకాల దుకాణాలు తెరుచుకోవచ్చు.. కంటైన్​ మెంట్​ జోన్ లో మాత్రం తెరిచి ఉండవ్​. ప్రతి షాపులో శానిటైజర్ తప్పనిసరిగా ఉంచాలి. ద్రావణాలు పిచికారీ చేయించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు బయటికి వెళ్లొద్దు.
సిటీ బస్సులు నడువవ్
ఉదయం ఆరు
గంటల నుంచి ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయి. అయితే హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులు నడవవు. ఎంజీబీఎస్​ వరకు బస్సులు రావు. సీబీఎస్​, ఎల్​బీ నగర్​ వరకు బస్సులు నడుస్తాయి. ఆటోలో డ్రైవర్‌ +2, టాక్సీలో డ్రైవర్‌ +3 నియమం పాటించాలి. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చు. ఈ-కామర్స్‌ ను అనుమతిస్తున్నాం. ఆర్టీసీ బస్సులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నడిపిస్తాం. ప్రైవేట్​, ప్రభుత్వ ఆఫీసులు జాగ్రత్తలతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. పరిశ్రమలు కూడా వందశాతం సిబ్బందితో పనులు నిర్వహించుకోవచ్చు. కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది.
మతపరమైన ఉత్సవాలు బంద్
అన్నిమతాల ప్రార్థనా మందిరాలు బంద్. మతపరమైన ఉత్సవాలు నడవవ్​. మాల్స్, సినిమా హాల్స్, ఫంక్షన్ హాల్స్ బంద్. ర్యాలీలు.. సమావేశాలు.. బంద్. అన్నిరకాల విద్యాసంస్థలు బంద్. బార్లు, పబ్బులు, క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్, స్టేడియాలు, జిమ్ లు, అమ్యూజ్మెంట్ పార్కులు బంద్.
తెలంగాణ ప్రజలకు భంగం కలిగితే ఊరుకోం
ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల మేరకే ప్రాజెక్టులు కట్టుకున్నాం. పోతిరెడ్డిపాడుపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తా. నీటి వాటాలపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది. మాకున్న వాటా మేరకు నీళ్లను వాడుకుంటున్నాం. గోదావరి మిగులు జలాలు ఎవరు వాడుకున్నా అభ్యంతరం లేదు. తెలంగాణ ప్రజలకు భంగం కలిగితే మాత్రం ఊరుకునేది లేదు. రాయలసీమ గోదావరి మిగులు జలాలు వాడుకోవచ్చు. కృష్ణాజలాల విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదు. చట్టం పరిధిలో మా ప్రజలకు న్యాయం చేస్తాం. బాబ్లీపై పంచాయతీ పెట్టి ఏం సాధించారు. పోతిరెడ్డిపాడు గురించి ఎవరు కొట్లాడారో ప్రజలకు తెలుసు. వివాదాలకు పోకుండా సమస్యలు పరిష్కరించుకుంటాం.