Breaking News

ఫేసులకు కాదు.. బండ్లకు పెడుతున్నారు మాస్కులు

హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నివారించడానికని తీసుకొచ్చిన మాస్కులను ముఖానికి ధరించాలని ప్రభుత్వాలు.. వైద్యులు చెబుతుంటే పలువురు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ‘అది మమ్మల్ని ఏమీ చేయదు.. కరోనా వస్తే మాకేంటి..?’ అనే రీతిలో నడుచుకుంటున్నారు. హైదరాబాద్ లో అయితే పలువురు ఆకతాయిలైతే.. నిఘా కెమెరాలను, పోలీసుల ఈ ఛాలన్ల నుంచి తప్పించుకోవడానికి కూడా మాస్కులనే వాడుతున్నారు. అదేంటి.. మాస్కులకు, ఈ ఛాలన్లకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త చదవాల్సిందే.. హెల్మెట్ లు పెట్టుకోకుంటే ఏ జంక్షన్ కు వెళ్లినా, ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసినా.. అక్కడుంటే కానిస్టేబులో.. లేక నిఘా కెమెరాలో క్లిక్ మనిపిస్తాయి. అంతే.. 24 గంటల్లో బిల్లు మోతెక్కాల్సిందే.. అయితే నిఘా కెమెరాలు, చలాన్ల నుంచి తప్పించుకోవడానికి రాజధాని వాహనదారులు కొత్త తరహా ఐడియాలకు దిగుతున్నారు. ముఖాలకు పెట్టుకోవాల్సిన మాస్కులను.. బండి నెంబర్ ప్లేట్ కు తగిలిస్తున్నారు. ఒకానొక దశలో ముఖానికి మాస్కులు లేకుంటే ఫైన్లు వేసిన పోలీసులు.. ఇప్పుడు ఈ వ్యవహారంతో తలలు పట్టుకుంటున్నారు. నిజంగా ఇది నిజం. హైదరాబాద్ లో ఇప్పటివరకూ ఈ తరహా కేసులు 12 నమోదయ్యాయి. నెంబర్ ప్లేట్లకు మాస్కులు తగిలించినందుకు గానూ.. అసిఫ్ నగర్ క్రాస్ రోడ్, మెహిదిపట్నం, పంజాగుట్ట లలో పలువురు ద్విచక్రవాహనదారులు ఈ తరహా పనులు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు గానూ 12 మందిపై సెక్షన్ 420, సెక్షన్ 511 కింద చీటింగ్ కేసులు నమోదుచేశామని పోలీసులు తెలిపారు. ఇలా చేస్తున్నవారి బండ్లను సీజ్ చేస్తున్నామని, అంతేగాక కేసులు నమోదైతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మాస్కులతో పాటు పలువురు ఆకతాయిలు.. చలాన్ల నుంచి తప్పించుకోవడానికి తమ నెంబర్ ప్లేట్ల నుంచి ఒక్క అక్షరాన్ని తీసేస్తున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది.