Breaking News

ఫుల్​ స్టేడియంలో ఆ కిక్కే వేరు

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాదిరిగా 25 శాతం మంది ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించినా బాగానే ఉంటుందని బ్యాటింగ్​ దిగ్గజం సచిన్​ టెండూల్కర్​ అన్నాడు. ప్రేక్షకులు లేకపోతే మ్యాచ్​ల్లో ఉత్సాహం ఉండదన్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తే అంతకంటే గొప్ప విషయం మరోటి లేదన్నాడు. ‘ఫుల్​ స్టేడియంలో మ్యాచ్‌ ఆడితే వచ్చే కిక్కే వేరు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడటం ద్వారా ఎనర్జీ మిస్‌అవుతాం. ప్లేయర్లకు ఇది మైనస్‌ పాయింట్‌. గ్రౌండ్‌లో అభిమానులు చేసే హంగామా ఏం చేసినా రాదు. కాబట్టి కనీసం 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించినా బాగుంటుంది. ఈ విషయంలో ఆసీస్‌తీసుకున్ని నిర్ణయం చాలా గొప్పది’ అని సచిన్‌పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్​ నిర్వహించగలమో లేదో ముందుగా క్రికెట్‌ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయించుకోవాలన్నాడు. దీనిపై వెంటనే నిర్ణయానికి రావడం కూడా కొద్దిగా కష్టమేనని చెప్పాడు. అయితే వచ్చే నెలలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ టెస్ట్‌సిరీస్‌ ద్వారా క్రికెట్‌ రీస్టార్ట్‌ అవుతుండడం చాలా ఆనందాన్నిస్తోందన్నాడు. బౌలర్లకు ఇబ్బందిగా మారే ఉమ్మి నిషేధంపై ఐసీసీ ప్రత్యామ్నాయం చూపెట్టాలని సచిన్​ కోరాడు.