Breaking News

ఫుట్​బాలర్​ సేంద్రియ సేద్యం



న్యూఢిల్లీ: కరోనా లాక్​ డౌన్​తో ఇళ్లకే పరిమితమైన ఆటగాళ్లు కొత్త వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు. ఎక్కువ మంది సామాజిక మధ్యమాల్లో గడుపుతుంటే.. మరికొందరు వ్యవసాయంలో సేద తీరుతున్నారు. భారత ఫుట్​బాల్​ జట్టు మాజీ కెప్టెన్ గౌరీమాంగ్ సింగ్ కూడా తన పొలంలో సేంద్రియ సేద్యం చేస్తూ ఉత్సాహం పొందుతున్నాడు. ఇంఫాల్​లో సోదరులతో కలిసి కూరగాయలు పండిస్తున్నాడు. ‘మా ఇంటి పక్కనే కొంత పొలం ఉంది. రెండేళ్ల నుంచి అక్కడ కూరగాయలు పండిస్తున్నాం. అయితే లాక్​డౌన్​తో నేను కూడా ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. దీంతో అల్లం, పసుపు, మిరప సాగు చేశాం. దోసకాయ, మొక్కజొన్న, గుమ్మడి, కాకరకాయలాంటి విభిన్నమైనవి పండిస్తున్నాం. ఇవన్నీ సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నాం. నాకూ గార్డెన్​లో గడపడం చాలా ఇష్టం. అందుకే నేను కూడా ఇందులో పాలుపంచుకుంటున్నా.

ఓవైపు ఎక్సర్​సైజ్​, మరోవైపు మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజు కొన్ని గంటలు అక్కడే గడుపుతున్నా. కూరగాయలతో మాకు మంచి ఫలితం కూడా రావడం ఆనందగా ఉంది’అని గౌరీమాంగ్ పేర్కొన్నాడు. భవిష్యత్​లో ఈ వ్యవసాయాన్ని మరింత విస్తరించాలనుకుంటున్నట్లు చెప్పాడు. భారత్ తరఫున 71 మ్యాచ్​లు ఆడిన గౌరీమాంగ్.. 2013లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.