దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార.. ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో కలిసి దేశంలోని ప్రముఖ తీర్థయాత్రలకు వెళ్లనున్నట్టు సమాచారం. ఈ మేరకు తమిళ ఫిలిం వెబ్సైట్లు, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నయన్, విఘ్నేశ్‌పై కొంతకాలంగా తరుచూ ఏవో ఒక వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వారిద్దరూ ఓ గుడిలో రహస్య వివాహం చేసుకున్నారని కొంత కాలం క్రితం వార్తలు వినిపించాయి. పెళ్లికి ముందు నయనతార కొన్ని దేవాలయాలకు వెళ్లి మొక్కు తీర్చుకోవాల్సి ఉందట. ఈ ఆధ్యాత్మిక యాత్రల తర్వాత తమిళనాడులోనే ఒక దేవాలయంలో వీరి వివాహం జరుగనున్నట్టు సమాచారం. గతంలో ఆమె ప్రముఖ హీరో శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపి, వివిధ కారణాలతో వారికి బ్రేకప్ ఇచ్చినట్టు ప్రచారం సాగింది. పెళ్లి తర్వాత కూడా తాను సినిమాల్లో నటిస్తానని నయనతార ఇటీవల మీడియాకు చెప్పింది.