సారథి న్యూస్, ఎల్బీనగర్: ప్రభుత్వ వైఫల్యంతోనే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, రాష్ట్రంలో కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ రంగారెడ్డి అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, 50వ పుట్టినరోజు సందర్భంగా హయత్ నగర్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాలులో కరోనా నిబంధనలకు అనుగుణంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. హయత్గర్ మాజీ ఎంపీపీ మల్రెడ్డి రాంరెడ్డి రక్తదానం చేశారు. ముఖ్యఅతిథులుగా చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై మాట్లాడారు.
బంగారు తెలంగాణలో కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటింటికీ కరోనా వైద్యపరీక్షలు నిర్వహించాలని కోరారు. తెలంగాణలో కరోనా టెస్టులు చేయడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఉద్యోగుల జీతాల్లో 50శాతం, పిన్షనర్లకు 25శాతం కట్ చేయడం బాధాకరమని, కేంద్ర ప్రభుత్వం అందజేసిన నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జక్కిడి ప్రభాకర్రెడ్డి, మైనార్టీ సెల్ డివిజన్ అధ్యక్షుడు సల్మాన్, క్రిష్ణ నాయక్, జగన్ నాయక్, శ్రీనునాయక్, గోపి తదితరులు పాల్గొన్నారు.