ప్రభాస్ హీరోగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ రోజుకొకటి తెరపైకి వస్తున్నాయి. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్న క్రమంలో త్వరలోనే విలువిద్య లాంటివి నేర్చుకోవడంతో పాటు ఆ పాత్రకు తగ్గట్టు బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ పై దృష్టి పెట్టబోతున్నాడన్న అప్ డేట్ ఒకటొచ్చింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనె నటిస్తోంది. దీంతో ‘ఆదిపురుష్’లోనూ బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోబోతున్నారనే వార్తలొచ్చాయి. అయితే ‘మహానటి’తో మెప్పించిన కీర్తీసురేష్‌ను సీత పాత్రకు ఎంపిక చేశారనే టాక్ ప్రముఖంగా వినిపించింది. కానీ కీర్తీ మాత్రం తననెవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు కియారాఅద్వానీ పేరు వినిపిస్తోంది.
‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’వంటి చిత్రాల్లో నటించిన కియారా.. అటు బాలీవుడ్‌లోనూ ‘ఎంఎస్ ధోని’, ‘కబీర్ సింగ్’ లాంటి సినిమాలతో మెప్పించింది. జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న హీరోయిన్ కనుక ఈ సినిమాలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా టైమ్ ఉంది. కాబట్టి హీరోయిన్ ఎంపిక లాంటి విషయాల కంటే కూడా ప్రీ ప్రొడక్షన్‌పైనే దర్శకుడు ఓం రౌత్ ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ముఖ్యంగా గ్రాఫిక్స్ ఇంపార్టెన్స్ ఉన్న సినిమా కావడంతో బెస్ట్ వీఎఫ్ఎక్స్ టీమ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ క్రమంలో సూపర్ హిట్ టీవీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు వర్క్ చేసిన కెనడాకి చెందిన వీఏఎక్స్ కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి ఈ ప్రాజెక్ట్ తో ‘బాహుబలి’స్థాయి మరో భారీ సినిమా ప్రభాస్ నుంచి రాబోతోందనే విషయం అర్థమవుతోంది. అంతేకాదు ప్రభాస్ 21వ చిత్రం నాగ్ అశ్విన్ తో ఉంటుందని, ప్రభాస్ 22వ చిత్రానికి (ఆదిపురుష్) ఓం రౌత్ దర్శకత్వం వహిస్తారని భావించారంతా. నాగ్ అశ్విన్ తో ఇప్పటికే అధికారికంగా ప్రభాస్ 21వ చిత్రాన్ని లాంచ్ చేసేశారు కూడా. కానీ అశ్విన్ కంటే ఆలస్యంగా సీన్ లోకి వచ్చిన ఓం రౌత్ ప్రకటనలు స్పీడ్ గా స్ర్పెడ్ అవుతున్నాయి. నాగ్ అశ్విన్ ఇంకా ప్రభాస్ తో రెగ్యులర్ చిత్రీకరణ గురించి చెప్పనే లేదు. ఈలోగా ఓం రౌత్ మాత్రం తన సినిమా జనవరి నుంచి మొదలైపోనుందని ప్రకటించడంతో బోలెడన్నీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.