ప్రముఖ వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ టెలివిజన్ చానెల్ వారు మొదటిసారి కర్ణాటక రాష్ట్రంలోని వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ పై ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న 8 గంటలకు డిస్కవరీ చానెల్లో ప్రసారమయ్యే ఈ డాక్యుమెంటరీకి ఇంగ్లిష్‌లో డేవిడ్ అట్టెన్ బోరోగ్ వాయిస్ నిచ్చారు. మనదేశంలో ప్రముఖ భాషలైన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రసారమయ్యే ఈ డాక్యుమెంటరీకి ఇక్కడి హీరోలతోనే వాయిస్ చెప్పించారు. హీందీ అనువాదానికి రాజ్ కుమార్ రావు, మాతృక కన్నడకు రిషబ్ శెట్టి వాయిస్ ఇవ్వగా తమిళం, తెలుగు భాషలకు సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ వాయిస్ ఇచ్చారు.
‘మన దేశంలోని ఒక అందమైన మహారణ్యంలో ఉంటున్న జంతు జీవాల గురించి ఎవరూ చెప్పనిది, ఎక్కడా వినని ప్రాణమున్న కథ.. ఈ అరుదైన కొండల్లో ఉండే మన తోటి ప్రాణుల కథ. దట్టమైన అడవుల్లోనూ, విశాలమైన మైదానాల్లోనూ స్వేచ్ఛగా తిరిగే జంతు జీవజాలం కథ.. ఒకే అరణ్యంలో బతికే అనేక రకాల జంతు సంపద గురించి కథ..’ అంటూ సాగిన ప్రకాష్ రాజ్ వాయిస్ ప్రోమోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది విని ఇంప్రెస్ అయిన సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘నేను ఈ ప్రోగ్రాం చూసేందుకు వెయిట్ చేస్తున్నా..’ అంటూ ప్రకాష్ రాజ్‌ను ఎంకరేజ్ చేస్తూ ట్వీట్ చేసారు. తెలుగులో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రామ్‌ను చూసేందుకు మహేష్ బాబు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.