- రెండు నెలల్లో రూ.50లక్షలకు పైగా ఆదాయం నష్టం
- ఉద్యోగులకు మూడునెలలుగా సగం జీతమే చెల్లింపు
- భక్తుల కోరికపై ఆన్‌లైన్ ద్వారా అమ్మవారికి పూజలు
సారథి న్యూస్, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారు పైడితల్లి అమ్మవారి ఆలయానికి కరోనా ఎఫెక్ట్ తగిలింది. మార్చిలో కరోనా వైరస్ ప్రభావంతో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఆలయాన్ని మూసివేశారు. దీంతో భక్తుల ద్వారా వచ్చే లక్షల ఆదాయానికి గండిపడింది. ఆలయ హుండీల ద్వారా వచ్చే మొత్తం ద్వారానే సిబ్బందికి జీతభత్యాల చెల్లింపులు, అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. అయితే ఆదాయం నిలిచిపోవడంతో ఉద్యోగులకు కూడా మూడు నెలలుగా సగం జీతం మాత్రమే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏటా పైడితల్లి ఆలయానికి రూ.4.12కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది ఇవి కాకుండా ఈ ఆలయ పరిధిలో మరో 24 టెంపుళ్లు ఉన్నప్పటికీ అందులో కేవలం నాలుగైదు ఆలయాలకు మాత్రమే హుండీ ఆదాయం వస్తుంది. అవి కూడా ఏడాదికి రూ.నాలుగైదు లక్షలు మాత్రమే. ప్రస్తుతానికి ఇవి కూడా మూసివేయడంతో ఆదాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా రెండు నెలల్లో రూ.50 లక్షలకు పైగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది.
ఆన్‌లైన్ లోనే పూజలు
నిత్యపూజలతో భక్తులతో కిటకిటలాడే పైడితల్లి అమ్మవారి ఆలయం ప్రస్తుతం బోసిపోయింది. సహస్ర కుంకుమార్చనలు, విశిష్ట అర్చనలు, అభిషేకాలు, చండీహోమాలు, స్వర్ణపుష్పార్చనలు, పుష్పాలంకరణలు కేవలం అర్చకుల సమక్షంలోనే లాక్‌డౌన్ నిబంధనలు అనుసరిస్తూ చేస్తున్నారు. భక్తులందరికీ ఆన్‌లైన్ ద్వారా పూజా కార్యక్రమాలు వారి గోత్రనామాలతో అమ్మవారికి పూజలు చేసేందుకు ఆన్‌లైన్ పూజా విధానాన్ని దేవస్థానం కల్పించింది. ఇందుకోసం ఎక్కడి నుంచైనా భక్తులు ఫోన్ ద్వారా వివరాలు అందజేస్తే వారి గోత్రనామాలతో అమ్మవారికి భక్తులకు కావాల్సిన రీతిలో పూజ చేయిస్తున్నారు. ఈ విధానం బాగా ఆదరణపొందడంతో విశేష స్పందన లభిస్తోంది. పూజా విధానం చేయించాలనుకునే భక్తులు 08922–222789 , కానీ 9491000710 నంబర్లు, లేదా ఆలయ ఆఫీసులో నేరుగా సంప్రదించవచ్చనని అధికారులు సూచిస్తున్నారు. pydithalli ammavari [email protected] ద్వారా వివరరాలు పొందవచ్చని తెలిపారు.
నిరంతరం అన్నదానం
కరోనా ప్రభావం కారణంగా చెల్లాచెదురైన నిరాశ్రయలకు పైడితల్లి ఆలయ దేవస్థానం వారు తమవంతు బాధ్యతగా ప్రతిరోజూ ఉదయం, రాత్రి కలిపి 125 భోజన ప్యాకెట్లను వండించి పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇద్దరు సిబ్బందిని నియమించారు. అమ్మవారి చదురుగుడి వద్ద ఈ ఉచిత భోజన పంపిణీ నిర్వహిస్తున్నారు. నిత్యన్నదానానికి దాతలిచ్చే విరాళాలతో మరింత భోజన సదుపాయం కల్పించనున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపింది.