లండన్: చైనాలోని వూహాన్‌లో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు, వ్యాపారాలు ఇబ్బందుల్లో పడ్డాయి. కాగా.. ఇప్పుడు కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగిపోతుందని సర్వేలో తేలింది. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ పార్ట్‌లోని యూఎన్‌యూ, డబ్యూఐడీఈఆర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కింగ్స్ కాలేజ్ లండన్, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ కూడా దీనిపై రిసెర్చ్ చేశాయి.
లాక్‌డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదలు రోజుకు 500 మిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని కోల్పోతున్నారని అంచనా వేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితి మరింత డేంజర్ జోన్‌లో ఉందని చెప్పింది. బంగ్లాదేశ్, ఇండియా, ఇండోనేషియా, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్ లాంటి దేశాల్లో ప్రజల ఆర్థిక పరిస్థితి అత్యంత ఇబ్బందులు పడే అవకాశం ఉందని నివేదిక చెప్పింది. శుక్రవారం దీనికి సంబంధించి రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 395 మిలియన్ల మంది అత్యంత పేదరికంలోకి వెళ్లిపోతారని చెప్పింది. రోజుకు 1.90 డాలర్లలోపు ఆదారం ఉన్నవారిని నిరుపేదలుగా పరిగణిస్తారు. దీంతో ఇప్పుడు వారి సంఖ్య 700 మిలియన్లుగా ఉంది, అయితే ఆ సంఖ్య ఇప్పుడు 1.1 బిలియన్లకు చేరనుందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. పేదరికాన్ని రూపుమాపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అలా కాని పక్షంలో 30 ఏండ్లుగా సాధించిన ఫలితాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయని రీసెర్చ్‌లో పాల్గొన్న ఒకరైన కింగ్స్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ ఆండీ సమ్నర్ చెప్పారు.