Breaking News

పుష్కరాలకు కార్తీక శోభ

పుష్కరాలకు కార్తీక శోభ

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తుంగభద్ర పుష్కరాలకు కార్తీక శోభ సంతరించుకుంది. పవిత్ర సోమవారం కావడం, పుష్కరాలు 11వ రోజు కావడంతో పలు ఘాట్లకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండల పరిధిలోని పుల్లూరు పుష్కర ఘాట్ కు తాకిడి పెరిగింది. ఇక్కడ వేలసంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా పరిధిలోని ఘాట్లలో నదీస్నానాలకు అనుమతి లేకపోవడంతో అలంపూర్ పుష్కర ఘాట్ కు భక్తులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. కొందరు నదిలో మరికొందరు షవర్ల కింద స్నానాలు చేసి పునీతులయ్యారు. పుల్లూరు పుష్కరాలకు వచ్చిన భక్తులు, అధికారులు, మీడియా సిబ్బందికి మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి నివాసంలో ఉచితంగా భోజన వసతి కల్పించారు. కాగా, మంగళవారం 12వ రోజుకు పుష్కరాలు ముగింపు ఉంటాయని, సాయంత్రం ఏడు గంటలకు నది హారతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్, ఈవో వెల్లడించారు.