Breaking News

పిల్లలతో పనులు చేయిస్తే చర్యలు

సారథి న్యూస్, కర్నూలు: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు చట్టాలు రూపొందించాయని, పిల్లలతో పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప హెచ్చరించారు. ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేరకు మంగళవారం కర్నూలు జిల్లాలో ఆపరేషన్‌ ముస్కాన్‌ను ప్రారంభించారు. అందులో భాగంగా నగరంలోని రాజ్‌విహార్‌ సెంటర్‌ నిర్వహించిన ఆపరేషన్‌ ముస్కాన్‌లో ఎస్పీ పాల్గొన్నారు. రెస్క్యూ చేసిన వీధి, అనాథ బాలలకు శానిటైజర్లు, మాస్కులు, బిస్కెట్లను ఎస్పీ పంపిణీ చేశారు. కర్నూలు పట్టణంలోని రాజ్‌విహార్‌, బంగారుపేట, వన్‌ టౌన్‌ ఏరియా, గడియారం ఆస్పత్రి, బళ్లారి చౌరస్తా, ఆనంద్‌ థియేటర్‌ తదితర ప్రాంతాల్లో 18 మంది వివరాలను ఆరాతీశారు.
జిల్లావ్యాప్తంగా 103 మంది బాలబాలికలను గుర్తించినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ ఉన్నందున జిల్లాలో ఎక్కువ మంది బాలబాలికలతో పనులు చేయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. బాలకార్మికులతో పనులు చేయించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ ను అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పకడ్బందీగా నిర్వహించాలని పోలీసులకు సూచించారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 55 పోలీసు బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేపడతామన్నారు. కార్యక్రమంలో మహిళా పోలీస్​స్టేషన్‌ డీఎస్పీ వెంకట్రామయ్య, కర్నూలు పట్టణ సీఐలు మహేశ్వరెడ్డి, విక్రమ్‌ సింహా, శ్రీనివాస్​రెడ్డి, ఎస్సై జగన్, శ్రీనివాస్, డీసీపీవో శారద, పీవో దీపారాణి, సోషల్‌ వర్కర్‌ నరిసింహులు పాల్గొన్నారు.