న్యూఢిల్లీ: మహిళల క్రికెట్‌కు ప్రజాదరణ పెంచాలన్నా.. ఎక్కువ మంది ఇందులోకి రావాలన్నా ఆటలో కొన్ని మార్పులు చేయాలని టీమిండియా ప్లేయర్ జెమీమా రొడ్రిగ్స్ సూచించింది. ఇందులో భాగంగా పిచ్ సైజ్‌ను కొద్దిగా తగ్గిస్తే ఫలితాలు మరోలా ఉంటాయని అభిప్రాయపడింది. ‘ఇప్పుడున్న దానికంటే పిచ్ సైజ్‌ను కాస్త తగ్గించాలి. దీనివల్ల ఫలితాలు భిన్నంగా వస్తాయి. ఆటలో మజా కూడా పెరుగుతుంది. ఎక్కువ మంది ఆటను చూస్తారు. ఆడేందుకు ఆసక్తి కనబరుస్తారు. అందుకే ఓసారి ప్రయత్నించి చూడాలి’ అని ఐసీసీ వెబినార్‌లో రొడ్రిగ్స్ పేర్కొంది. మరోవైపు ఇదే చర్చలో పాల్గొన్న న్యూజిలాండ్ కెప్టెన్ సోఫియా డివైన్ మరికొన్ని సూచనలు చేసింది. పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల మ్యాచ్‌ల్లో వాడే బంతి చాలా చిన్నగా ఉంటుందని సోఫియా వెల్లడించింది. ఈ బంతి సైజ్‌ను ఇంకాస్త చిన్నదిగా చేయాలని చెప్పింది.
‘యువ క్రికెటర్లను ఆకర్షించాలంటే పాత పద్ధతులకు స్వస్తి పలకాలి. పిచ్‌కు బదులు బంతి సైజ్ తగ్గించాలి. దీనివల్ల పేసర్లు బంతిని మరింత వేగంగా వేస్తారు. స్పిన్నర్లు సులువుగా స్పిన్ రాబడతారు. దీనివల్ల ఆటలో వేగం పెరిగుతుంది. చూసేవాళ్లకు ఉత్సాహం వస్తుంది’ అని సోఫియా వ్యాఖ్యానించింది.