సారథి న్యూస్, హైదరాబాద్: ‘మనం ఇంట్లో హాయిగా నిద్రపోగలుగుతున్నామంటే దానికి సరిహద్దుల్లో ఉన్న సైనికుల త్యాగం, దయే కారణం. ఎముకలు కొరికే చలి, మండుటెండలు, ఆక్సిజన్ అందని వాతావరణంలో సైతం వారు విధులు నిర్వర్తిస్తుంటారు. నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ వారు దేశానికి చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఇప్పటి వరకూ సైనికుడు లేదా అతడి కుటుంబ సభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్లలో ఏదో ఒకటి మాత్రమే అందుతున్నది. కానీ ఇప్పటి నుంచి తెలంగాణలో ఆ రెండింటినీ అందించాలని నిర్ణయించాం. సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తాం..‘2017 అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన ఇది.
సీఎం చెప్పిన మిగతా సంక్షేమ విషయాల మాట ఎలా ఉన్నా గత 15నెలల నుంచి రాష్ట్రంలోని దాదాపు వంద మంది సైనికుల (వీరంతా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆర్మీలో పనిచేసిన వారు)కు, వారి కుటుంబాలకు పెన్షన్ అందడం లేదు. అప్పట్లో విధులు నిర్వర్తించిన వీరిలో కొందరు బతికే ఉండగా, మరికొందరు మరణించారు. ఇప్పుడున్న వారితోపాటు చనిపోయిన వారి భార్యలు, కుటుంబాలకు నెలకు రూ.ఆరువేల చొప్పున పెన్షన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2019 జూన్ నుంచి ఈ పెన్షన్ అందడం లేదు. సంబంధిత ఫైల్ ఆర్థికశాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి పేషీలో కొన్నినెలల వరకూ పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు ఇటీవలే ముఖ్యమంత్రి పేషీకి చేరింది. అక్కడ దానికి మోక్షం లభించకపోవడంతో పెన్షన్ రావడం లేదని తెలిసింది.
కరోనా నేపథ్యంలో పౌష్టికాహారం తీసుకోవాలి… బీపీ, షుగర్ లాంటి వాటితోపాటు తమకున్న ఇతర జబ్బులకు క్రమం తప్పక మందులు వాడాలని బాధితులు చెబుతున్నారు. పెన్షన్ రాకపోవడంతో తాము ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల తక్షణం ఫైలుపై సంతకం చేయడం ద్వారా తమకు పెన్షన్‌ను ఇప్పించాలని సీఎంను కోరుతున్నారు. తద్వారా తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
బాగా కష్టమైతాంది
నెలల సంది పెన్షన్ రాకపోయేసరికి ఇంట్లో బాగా కష్టమైతాంది. మా ఆయన పోయిన తర్వాత నాకు పెన్షనే ఆధారమైంది. ఇప్పుడు అది రాకపోయేసరికి మస్తు ఇబ్బందులు పడుతున్నా. గవర్నమెంటోళ్లు ఎట్లయినా పెన్షన్ ఇప్పించాలే.
:: జైనాబీ, మాజీ సైనికుడు అబ్దుల్ కరీం భార్య,
నిర్దవెల్లి, రంగారెడ్డి జిల్లా