Breaking News

పారదర్శకంగా ఇంటిస్థలాల కేటాయింపు

పారదర్శకంగా ఇంటిస్థలాల కేటాయింపు

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు’ పట్టాల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా అమలుచేయాలని కర్నూలు మున్సిపల్​కార్పొరేషన్​కమిషనర్ డీకే బాలాజీ స్పష్టంచేశారు. సోమవారం ఆన్ లైన్ విధానంలో లబ్ధిదారులకు లేఅవుట్ స్థలాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్​ సుధాకర్ పాల్గొన్నారు.

కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద మొత్తం 21,488 మంది అర్హత కలిగిన లబ్ధిదారులు ఉండగా, అందులో కర్నూలు నియోజకవర్గంలో 10,344 మంది, పాణ్యం నియోజకవర్గంలో 9,467 మంది, కోడుమూరు నియోజకవర్గంలో 1677 మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. ఈ క్రమంలో 16,780 మంది లబ్ధిదారులకు రుద్రవరం గ్రామ శివారులో, 4,708 మంది లబ్ధిదారులకు తడకనపల్లి గ్రామ పరిధిలో ఇళ్లస్థలాలను కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, ఎస్ఈ సురేంద్రబాబు, ఎంఈ రమణమూర్తి, సీనియర్ అసిస్టెంట్ మన్సూర్, హోసింగ్ సీఎల్టీసీ డాక్టర్​ పెంచలయ్య పాల్గొన్నారు.