Breaking News

పదవికి వీకే సింగ్ రాజీనామా

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ పదవికి సినీయర్​ ఐపీఎస్ వినోద్ కుమార్ సింగ్(వీకే సింగ్) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పంపించారు. కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై వీకే సింగ్ అసంతృప్తితో ఉన్నారు. మే 21న కూడా తన పదోన్నతికి సంబంధించి సీఎస్‌కు లేఖ రాశారు. లేఖ కాపీని సీఎం కేసీఆర్‌కు కూడా పంపించారు. డీజీపీగా తనకు పదోన్నతి కల్పించాలని, అందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆ లేఖలో ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. నిబంధనల ప్రకారం 33 ఏళ్లు సేవలందించిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా తాను డీజీపీ పదవికి అర్హుడినని ఆయన లేఖలో ప్రభుత్వానికి తెలిపారు. పోలీస్ అకాడమీ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వృథాయేనని, పోలీస్ అకాడమీ వల్ల పెద్ద ఉపయోగం లేదని వీకే సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలు డిపార్ట్​మెంట్​లో పెను దుమారమే రేపాయి. తాను పదోన్నతికి పనికిరానంటే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని గతంలో వీకే సింగ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.