మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి
సారథి న్యూస్, మెదక్: పంటలు సాగుచేసే ప్రతి రైతుకు లాభం చేకూరేలా పంటమార్పిడి విధానం అమలు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో వ్యవసాయ, మార్కెటింగ్, అనుబంధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్స్ ప్రతినిధులు, సీడ్ డీలర్ల అసోసియేషన్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో రైతులలో పంట మార్పిడి, వరి, పత్తి, కంది పంటల సాగు చేసే విధానంపై అవగాహన కల్పించాలని అగ్రికల్చర్ ఆఫీసర్లకు సూచించారు.
సీఎం కేసీఆర్ సూచనల మేరకు మెదక్ జిల్లాలో వరి పంటను నియంత్రిత పద్ధతిలోసాగుచేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే మొక్కజొన్న పంటను కమర్షియల్ పద్ధతిలో సాగు చేయకూడదని సూచించారు. ప్రత్యామ్నాయంగా కందిని సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వమే తెలంగాణ సోనా, సన్నరకాల సీడ్స్ను సరఫరా చేస్తుందని కలెక్టర్ వివరించారు. మార్కెట్ లో నకిలీ విత్తనాలను అమ్మకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విత్తన డీలర్లు వరి విత్తనాలను ప్రభుత్వం చెప్పేంత వరకు రైతులకు అమ్మకూడదని హెచ్చరించారు. సమావేశంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు చంద్రపాల్, డీసీఎస్ వో శ్రీనివాస్, డీఏవో పరశురామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.