సారథి న్యూస్, హైదరాబాద్: కాన్పూర్ కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. 20 -25 ఏళ్ల కాలంలో ఒక హంతకుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగేంత వరకూ అక్కడి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. చిన్న దొంగతనం చేసిన నేరస్తులపైనే పీడీ యాక్టులు విధించే ఖాకీలు ఎందుకలా వదిలేశాయన్నది ప్రశ్నార్థకమే. అయితే కాన్పూర్‌కు చెందిన వికాస్ దుబే, తెలంగాణకు చెందిన నయీం ఎదిగిన తీరు ఒకేలా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నయీం పోలీసుల కోవర్టుగా చేసిన సాయానికి ప్రతిఫలం సెటిల్‌మెంట్స్ చేసుకోమని వదిలేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కోవర్టు నుంచి చివరకు సీఎంలను కూడా ధిక్కరించే వరకు ఎదిగిన అతని ఎనకౌంటర్‌లో హతమార్చాల్సి వచ్చింది. యూపీలో వేలాది మంది గ్యాంగ్‌స్టర్లు, రౌడీషీటర్లు, క్రిమినల్ గ్యాంగ్‌లు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ సీఎం అయ్యాక చాలామందిని ఎన్‌కౌంటర్ చేశారు. వందలాది మంది క్రిమినల్స్ అజ్ఞాతంలోకి జారుకున్నారు. కానీ వికాస్‌దూబే వంటి కరడుగట్టిన నేరస్తులు మాత్రం ఉనికి కోసం హత్యలు.. దందాలు చేస్తూనే ఉన్నారనేది దూబే ను చూస్తే అర్థమవుతుంది.
ఉలిక్కిపడిన ఉత్తరప్రదేశ్
జులై 3న ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్ ఉలిక్కిపడింది. యావత్ భారతదేశంలో సంచలనంగా మారింది. వికాస్‌దూబే అనే గ్యాంగ్‌స్టర్ తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై ఏకే 47, రైఫిల్స్‌తో కాల్పులు జరిపాడు. 8 మందిని హతమార్చాడు. ఒక మామూలు రౌడీకి ఏకే 47, రైఫిల్ దొరకడం ఎలా సాధ్యం. ఇంటర్నేషనల్ క్రిమినల్స్‌తో సంబంధాలు ఉంటే మినహా అది సాధ్యం కాదు. లేకపోతే.. ఏదైనా పోలీస్‌స్టేషన్‌పై దాడి చేయాలి. ఎవరైనా పోలీసులను హతమార్చి వారి వద్ద నుంచి చోరీ చేయాలి. ఈ రెండింట్లో ఏది జరిగిందనేది కూడా ప్రశ్నార్థకమే. నయీం ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు కూడా అతనిచేతిలో ఇదేరకమైన ఏకే 47 ఉంది. ఇప్పుడు దూబే కూడా అంతగా ఎదిగాడు. పైగా పోలీసులకు ఎన్‌కౌంటర్ ముందు చాలా చెప్పాడట. తనను పట్టుకునేందుకు వచ్చే పోలీసులు తెల్లవారుజామున వస్తారని పోలీసులే తనకు ఉప్పందించారన్నాడు. బలైన 8 మంది పోలీసులను తగులబెట్టి సాక్ష్యాలను తారుమారు చేద్దామనుకున్నాడట. తాను ఇచ్చే డబ్బులతో ఎంతో మంది పోలీసులు లాభపడ్డారంటూ ఎన్నో చెప్పాడట. కానీ అతడిని తీసుకొస్తున్న సమయంలో జోరున వర్షం కురిస్తుంది. ఆ వానలో కారు బోల్తాకొట్టింది. అదే అదనుగా తప్పించుకునేందుకు దూబే ప్రయత్నించాడు. పోలీసులు తమను తాము కాపాడుకునేందుకు జరిపిన ఎదురుకాల్పుల్లో దూబే హతమయ్యాడు.
నాలుగైదేళ్ల క్రితం నయీం ఎన్‌కౌంటర్‌లోనూ ఇదే వినిపించింది. నయీంకు సహకరించిన పోలీసులు, రాజకీయ నాయకులు దర్జాగా పదవులు అనుభవిస్తున్నారు. నయీం అనుచరులమంటూ అనుచరులు దర్జాగా దందాలు చేసుకుంటూనే ఉన్నారు. రేపు కాన్పూర్‌లోనూ ఇదే కనిపిస్తుంది. దూబే మరణించినా అతని చేతికింద పెరిగిన చోటా క్రిమినల్స్ ఇంకెంతగా చెలరేగుతారనేది సస్పెన్స్.