గ్లామర్ పాత్రలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో లేడీ ఓరియెంటెండ్ సబ్జెక్ట్స్కూడా నయనతార అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది. దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతూ బోలెడు సూపర్ హిట్లను తన ఖాతాలో జమచేసుకుంది. ఇప్పటికీ నయన్ చేతినిండా సినిమాలు ఉన్నాయి. వాటిలో మిలింద్ రౌ దర్శకత్వం వహిస్తున్న ‘నేట్రికన్’ ఒకటి. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై విఘ్నేష్ శివన్ ఈ మూవీ నిర్మిస్తున్నాడు. నయనతారకు ఇది 65 వ సినిమా. 2011 లో విడుదలైన బ్లైండ్ అనే కొరియన్ సినిమాకు ఇది రీమేక్ అని తెలుస్తోంది.
ఇప్పటికి 50శాతానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ నుంచి గురువారం సాయంత్రం నయన్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు ఫిల్మ్ మేకర్స్. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ బ్రెయిలీ లిపిలో ఉండటంతో నయన్ ఇందులో దివ్యాంగురాలి పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. అందుకు తగినట్టుగానే ఆమె లుక్ కూడా ఉంది. చెంపల వెంట రక్తం కారుతూ.. భయంతో నిండిన ముఖంతో.. చేతిలో రాడ్ తో ఎవరినో వెతుకుతున్నట్టు కనిపిస్తున్న నయన్ లుక్ సినిమాపై ఆశక్తి రేపుతోంది. ప్రస్తుతం నయన్ విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్న ‘కాత్తు వాక్కుల్ రెండు కాదల్’ తో పాటు రజినీకాంత్ అన్నాత్తే, భక్తిరస ప్రదానమైన ‘మూకుత్తి అమ్మన్’ సినిమాల్లో నటిస్తోంది.