Breaking News

మనసు దోచిన.. నీలి నీలి ఆకాశం

పాపుల‌ర్ యాంక‌ర్ ప్రదీప్​ మాచిరాజు హీరోగా ప‌రిచ‌యం అవుతున్న ‘30రోజుల్లో ప్రేమించ‌డం ఎలా’ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామ‌నుకున్నా’ పాట యూ ట్యూబ్‌లో సెన్సేష‌న‌ల్‌ రికార్డులు సృష్టిస్తోంది. సంగీతప్రియుల ఆద‌ర‌ణ‌తో 150 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి, చిన్న సినిమాల పాట‌ల్లో ఈ ఫీట్ సాధించిన సాంగ్‌గా స‌రికొత్త రికార్డును సృష్టించింది. సుకుమార్ వద్ద ‘ఆర్య 2’, ‘1.. నేనొక్కడినే’ చిత్రాల‌కు ప‌నిచేసిన మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్వీ ప్రొడ‌క్షన్స్​ బ్యాన‌ర్‌పై క‌న్నడ చిత్రసీమలో విజ‌య‌వంత‌మైన చిత్రాల నిర్మాత‌గా పేరుపొందిన ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు.
అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా, ‘నీలి నీలి ఆకాశం’ పాటతో స‌హా చిత్రంలోని అన్ని పాట‌ల‌నూ చంద్రబోస్ రాశారు. ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్​పై చిత్రీక‌రించిన‌ ‘నీలి నీలి ఆకాశం’ పాట 150 మిలియ‌న్ వ్యూస్ దాట‌డంతో చిత్రబృంద‌మంతా ఆనందాన్ని వ్యక్తంచేస్తోంది. టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే ఇదొక అరుదైన ఫీట్‌గా విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్నారు. స్టార్లు లేని ఒక చిన్న సినిమాలోని పాటకు ఈ స్థాయి ఆద‌ర‌ణ ల‌భించ‌డం అపురూప‌మైన విష‌యంగా వారు చెబుతున్నారు. అనూప్ రూబెన్స్ ఇచ్చిన విన‌సొంపైన బాణీల‌కు చంద్రబోస్​ రాసిన క‌మ‌నీయ సాహిత్యం, సింగ‌ర్స్‌ సిద్ శ్రీ‌రామ్‌, సునీత సుమ‌ధ‌ర గానం తోడై ఈ పాట‌ను ఇంత బ్లాక్‌బస్టర్​ చేశాయ‌ని నిర్మాత ఎస్వీ బాబు అన్నారు. ఈ సంద‌ర్భంగా సంగీత ప్రియుల‌కు ఆయ‌న ధ‌న్యవాదాలు తెలిపారు.
ఒక సింగ‌ర్‌ను ఐదేళ్లు బతికించడానికి ఒకపాట చాల‌నీ ‘నీలి నీలి ఆకాశం అలాంటి పాట‌నీ’ గాయ‌ని సునీత అన్నారు. త‌న కెరీర్‌లో ఈ పాట ఓ మ‌ధుర‌మైన మ‌లుపుగా నిలించింద‌ని ఆమె అమితానందం వ్యక్తంచేశారు.ఈ పాట విజ‌యోత్సవంలో తాను భాగ‌స్వామినే కాకుండా భావ‌స్వామిని కూడా అయినందుకు గర్వపడుతున్నానని లిరిసిస్ట్ చంద్రబోస్​ చెప్పారు. ఈ పాట‌ను అమ‌లాపురం నుంచి అమెరికా దాకా అంద‌రూ పాడుకుంటున్నార‌ని డైరెక్టర్​ మున్నా సంతోషం వ్యక్తంచేశారు. తాను ఇప్పటివరకు కంపోజ్ చేసిన సాంగ్స్‌లో ఏ పాట‌నీ విన‌న‌న్ని సార్లు విన్నాన‌ని మ్యూజిక్ డైరెక్టర్​ అనూప్ రూబెన్స్ అన్నారు.
‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా’ సినిమా ఔట్‌పుట్ చూసి నచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లతో జీఏ2, యూవీ క్రియేష‌న్స్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోవ‌డం విశేషం. ఇలా రెండు అగ్రడిస్ట్రిబ్యూష‌న్ సంస్థల స‌పోర్ట్ ల‌భించ‌డం సినిమాకు ప్లస్​ అవుతోంది.
సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, ప్రస్తుతం దేశంలో నెల‌కొన్న సంక్షోభ ప‌రిస్థితులు స‌మ‌సిపోయి, సాధార‌ణ పరిస్థితి నెలకొన్న తర్వాత చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత ఎస్వీ బాబు ప్రకటించారు.