‘భాగమతి’ సినిమా తర్వాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ కావడంతో ‘నిశ్శబ్దం’పై భారీ అంచనాలే ఉన్నాయి. అదికాకుండా ఈ మూవీని థియేటర్ లో మాత్రమే రిలీజ్ చేయాలనుకుంది టీమ్. అందుకు మరికొంత సమయం పట్టడం ఆడియాన్స్లో క్యూరియాసిటీ తగ్గిపోతుందేమోనన్న ఆలోచనతో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అనుష్క, ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ హేమంత్ మధుకర్. తెలుగు తమిళ భాషలతో పాటు మలయాళ డబ్బింగ్ వర్షన్ ను స్ట్రీమింగ్ కు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘నిశ్శబ్దం’ ట్రైలర్ ను దగ్గుబాటి రానా రిలీజ్ చేశాడు.
ఒక పెయింటింగ్ కోసం అనుష్క, మాధవన్ ఓ హంటెడ్ హౌస్ కు వెళ్లడంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది. ఇందులో అనుష్క ఓ పెయింటింగ్ కళాకారిణి అయిన మూగ యువతి సాక్షి పాత్రలో కనిపిస్తుంటే మాధవన్.. ఆంథోనీ అనే మ్యూజిషియన్ గా కనిపిస్తున్నాడు. అమెరికాలోని ఓ ఇంట్లో జరిగే సంఘటనల చుట్టూ సినిమా కథ నడిచినట్టుగా ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. అనుష్క బెస్ట్ ఫ్రెండ్ సోనాలి పాత్రలో షాలినిపాండే కనిపిస్తోంది. ఎంగేజ్మెంట్ అయిన రెండవ రోజు నుంచి సోనాలి కనిపించకుండా పోయిందని చెప్పడంతో ఆమె పాత్రకు కూడా బాగానే ప్రాధాన్యం ఉందనిపిస్తోంది. అంజలి, సుబ్బరాజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా కనిపించారు. సస్పెన్స్ అంశాలతో ట్రైలర్ ఉత్కంఠ భరితంగానే సాగుతూ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ నటులు మైఖేల్ మ్యాడ్సన్, శ్రీనివాస అవసరాల ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించగా గిరీష్ గోపాలకృష్ణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. షానైల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు.