- ఊరూరా సీసీ కెమెరాల ఏర్పాటు
- నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు
- సత్ఫలితాలు ఇస్తున్న పోలీసుల కృషి
సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ప్రాధాన్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థలో భాగంగా డివిజన్ పరిధిలోని ఆరు మండలాలు, 128 పంచాయతీల్లో మొత్తం 806 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. సిద్దిపేట జిల్లాకు తలమానికమైన కొమురవెల్లి మల్లన్న టెంపుల్ లో బ్రహ్మోత్సవాలు, కోహెడ మండలంలోని సింగరాయ జాతర, హుస్నాబాద్ మండలం పొట్లపల్లి మహాశివరాత్రి ఉత్సవాలు, గతేడాది జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పాత నేరస్తులపై నిఘా ఉంచుతూనే, గ్రామాల్లో విలేజ్పోలీస్ ఆఫీసర్లను నియమిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని పోలీసు అధికారులు, సిబ్బంది చెబుతున్నారు.
ఛేదించిన ఘటనలు ఇవే..
–గతేడాది జనవరి 4న మడద పంచాయతీ బంటుపల్లి గ్రామానికి చెందిన పోలోజు నాగరాజు అనే యువకుడు హుస్నాబాద్ పట్టణంలోని ఓ ఇంట్లో ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేశాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఐదుగంటల్లోనే కిడ్నాప్‌ను ఛేదించి బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
– హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ పరిధిలోని బాలునాయక్ తండాకు గ్రామానికి చెందిన నలుగురు యువకులు హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలంలోని గొర్రెల దొంగతనాలకు పాల్పడగా నిఘానేత్రాలే వారిని పట్టించాయి.
– అక్కన్నపేట మండలం మసిరెడ్డితండా మాలోతు రవికి చెందిన జేసీబీ వాహనం పట్టణంలోని ఓ బ్యాంకు ఎదుట నిలపగా, అందులో ఉన్న వంద లీటర్ల డీజిల్ ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. సీసీ కెమెరాల ఆధారంగా సైదాపూర్ మండలానికి చెందిన ఏ.కుమార్, ఎం.సునీల్‌ను సీసీ కెమెరాలే పట్టించాయి.
తగ్గిన క్రైమ్ రేట్
మూడేళ్లలో హుస్నాబాద్డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో క్రైమ్ రేట్ పడిపోయింది. ఇందుకు కారణం గ్రామాల్లో కనువిప్పు, ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ, కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థలో భాగంగా గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రజలను చైతన్యవంతం చేస్తూ సీసీ కెమెరాల ప్రాధాన్యంపై పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా, దొంగతనాలకు పాల్పడిన వెంటనే పోలీసు యంత్రాంగం క్షణాల్లో తెలుసుకునేందుకు గ్రామాలను జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయడమే కాకుండా త్వరితగతిన ఘటన స్థలానికి చేరుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు.
కమాండ్ సెంటర్ నుంచి పర్యవేక్షణ
గ్రామ కూడళ్లతో పాటు ప్రభుత్వ రంగసంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి పోలీస్ స్టేషన్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిక్షణ పొందిన పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. అందులో హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల పరిధిలో 95 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసుశాఖ ఉన్నతాధికారులు చెప్పారు. హుస్నాబాద్ మండలంలో 100, అక్కన్నపేట 126, కోహెడ 133, చేర్యాల 102, కొమురవెల్లి 120, మద్దూర్ 130 మండలంలోని పలు గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. అక్కన్నపేటలోని 9 గ్రామాలు, కొహెడ మండలంలోని 3 గ్రామాల్లో సీసీకెమెరాలను త్వరలో పూర్తి చేస్తామని ఏసీపీ తెలిపారు.
నేరాలు అదుపుచేసేందుకు కీలకమైనవి
శాంతిభద్రతల పర్యవేక్షణకు స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్, వర్తక వ్యాపార సంస్థలు, గ్రామ, మండలంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటుచేసిన క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (సీసీటీవీ) 24 గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. వీటిని ఏర్పాటు చేయడం ద్వారా అంతర్రాష్ట్ర ముఠాలు, వాహన చోదకులు రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే ముఖచిత్రాలతో పాటు వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించేందుకు వీలు కలుగుతుంది. నేరాలు చేసిన నేరాలను కోర్టుల్లో రుజువుచేసేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతున్నాయి.
– సందెపోగు మహేందర్, హుస్నాబాద్ ఏసీపీ
ఎప్పటికప్పుడు సెల్లో చూసుకుంటా..
నిత్యం కస్టమర్లతో మా దుకాణం రద్దీగా ఉంటుంది. హస్నాబాద్‌లో ఉన్న మా క్లాత్షో రూమ్‌కు నిత్యం ఎంతోమంది వస్తూ పోతుంటారు. వ్యాపార లావాదేవీలపై కస్టమర్లు ఇచ్చే డబ్బు, వస్తువుల కొనుగోళ్లను నేను షాపులో లేకపోయినా సెల్‌ఫోన్‌కు చూసుకుంటూ ఉంటాను.
– శివకుమార్, క్లాత్షోరూమ్యజమాని, హుస్నాబాద్