Breaking News

నాయిని ఇకలేరు

నాయిని ఇకలేరు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం మాజీ హోంమంత్రి, ప్రముఖ కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి (80) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా నుంచి కోలుకున్నా.. నిమోనియా బారినపడ్డాడు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. నాయినికి భార్య అహల్య, కొడుకు దేవేందర్‌రెడ్డి, కుమార్తె సమతారెడ్డి ఉన్నారు. నాయిని అల్లుడు వి.శ్రీనివాస్‌రెడ్డి రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌. సోషలిస్టుగా జీవితం ప్రారంభించిన నాయిని సాదాసీదా మనస్తత్వం.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే భోళాతనం ఆయన సొంతం. నల్లగొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్మ గ్రామానికి చెందిన నాయిని నర్సింహారెడ్డి ఫిబ్రవరి 12, 1940లో జన్మించారు. హెచ్‌ఎస్‌సీ వరకు చదువుకున్నారు. బాల్యం నుంచే చురుకైన విద్యార్థిగా ఎదిగారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌ నుంచి అప్పటి కార్మిక మంత్రి టి.అంజయ్య, మరోవైపు రెడ్డి కాంగ్రెస్‌ నుంచి గతంలో కార్మిక మంత్రిగా పనిచేసిన జి.సంజీవరెడ్డితో ఢీకొని ఆ ఇద్దరినీ ఓడించారు. 2,167 ఓట్ల మెజార్టీతో గెలుపొంది సంచలనం సృష్టించి జాయింట్‌ కిల్లర్‌గా ఖ్యాతిపొందారు. 1985లో రెండోసారి, 2004లో మూడోసారి అదేస్థానం నుంచి గెలుపొందారు. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ మంత్రిగా సేవలు అందించారు. వైఎస్‌ కేబినెట్‌ నుంచి టీఆర్‌ఎస్‌ వైదొలగిన సమయంలో అమెరికాలో ఉన్న నాయిని అక్కడి నుంచే నేరుగా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన నిబద్ధత చాటుకున్నారు.