గతేడాది మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాలో రవి అనే సీరియస్ పాత్ర పోషించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు అల్లరి నరేష్. కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయినా కూడా సీరియస్ పాత్రల్లో కూడా అంతే యాక్షన్‌ను పండించే ఈసారి కూడా నరేష్ ఓ సీరియస్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నరేష్ కెరీర్లో 57వ చిత్రంగా రూపొందుతున్న నాంది సినిమా పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అల్లరి నరేష్ పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా కింద కూర్చుని ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నాంది సినిమాను నిర్మిస్తున్నారు. మంగళవారం నరేష్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘ఒక మనిషి పుట్టడానికి కూడా 9నెలలే టైమ్ పడుతుంది.. మరి నాకు న్యాయం చెప్పడానికి ఏంటి సార్ ఇన్ని సంవత్సరాలు పడుతోంది..’ డైలాగ్‌తో సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది టీజర్. వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ గా దర్శనమిచ్చింది. విశాల్ ‘పందెంకోడి’, విజయ్ ‘సర్కార్’ సినిమాల్లో వరలక్ష్మి నటనకు మంచి ప్రశంసలు లభించాయి. తెలుగులో తెనాలి రామకృష్ణ సినిమాలో విలనిజం పండించిన వరలక్ష్మి ఇప్పుడు రవితేజ క్రాక్ సినిమాలో కూడా పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది. అలాగే ఈ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. హరీశ్ ఉత్తమన్, ప్రియదర్శి, ప్రవీణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.