సారథి న్యూస్, ఎల్బీనగర్: సీఎం కేసీఆర్ ఆకాంక్ష, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఎరుకల నాంచారమ్మ నగర్ లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం కింద ఇళ్లు నిర్మించినట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం తెలిపారు. 1.34 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివసించే లబ్ధిదారులకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పించినట్లు వెల్లడించారు.
మొత్తం 288 ఇళ్లలో స్థానికంగానే నివసిస్తూ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధిత భూమిని ప్రభుత్వానికి అప్పగించిన కుటుంబాలకు 154 ఇళ్లను కేటాయించామన్నారు. సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, హైదరాబాద్ మెట్రో వాటర్ సదుపాయం, విద్యుత్, లిఫ్ట్ వాహనాల పార్కింగ్‌కు ప్రతి డబుల్ బెడ్‌రూంకు సెల్లార్ పార్కింగ్, వర్షపునీటి సంరక్షణ పిట్స్, గ్రీనరీ ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు సమీపంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్టాప్, స్కూల్, ట్రాన్స్‌పోర్టు సదుపాయం ఉన్నట్లు మేయర్ తెలిపారు.