Breaking News

నడిగడ్డలో భారీ వర్షాలు

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): నడిగడ్డలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. పంట చేలు చెరువులను తలపిస్తున్నాయి. నెలరోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో వేసిన పంటలన్నీ నీట మునిగిపోతున్నాయి. వందల ఎకరాల్లో పత్తి, మిరప, ఉల్లిగడ్డ తదితర పంటలు చేతికందే పరిస్థితి లేకుండా పోయింది. ఉండవెల్లి మండలం పొంగూరు వాగు ఉధృతి కారణంగా సుమారు 500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సర్పంచ్ శ్రీలత భాస్కర్ రెడ్డి వెల్లడించారు.
వాగులో కొట్టుకుపోయిన కారు
కడప జిల్లాలకు చెందిన శివకుమార్ రెడ్డి, అతని భార్య సింధూరెడ్డి, జిలానీబాషా బెంగళూరు నుంచి హైదరాబాద్​కు కలుగొట్ల మీదుగా 44వ జాతీయ రహదారిని ఎక్కేందుకు కారులో బయలుదేరి వెళ్లారు. ఉండవెల్లి మండలంలోని కలుగొట్ల వాగులో కారు కొట్టుకుపోయింది. సింధూరెడ్డి నీటిలో గల్లంతైంది. ఆమె కోసం వాగులో గాలిస్తున్నారు. సీఐ వెంకట్రామయ్య హుటాహుటిన సిబ్బందిని పంపించారు.