Breaking News

నక్షత్రం.. వృక్షాలు.. ఫలితాలు

నక్షత్రం.. వృక్షాలు.. ఫలితాలు

వ్యక్తి జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రంగా చెబుతుంటారు. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెబుతారు. ఈ శాస్త్రంలో జీవితంలో సంభవించే సమస్యలు ఎలా వస్తాయో, వాటికి ఏ గ్రహాలకు శాంతులు చేయాలో ఈ శాస్త్రంలో పరిహారాలు సూచించారు. దానికనుగుణంగా మనం నక్షత్రశాంతులు, గ్రహశాంతులు జరిపించుకోవాల్సి ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రంలోని 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి. చాలామందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి తెలియదు. అయితే నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచడం ద్వారా దోషాలేమన్నా ఉంటే తొలగడమే గాక, సర్వసౌఖ్యాలను పొందవచ్చు. ఈ సూత్రాన్ని ఆచరించడం శుభం. మీరు జన్మించిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్ని పెంచితే అది పెరిగి పెద్దయ్యే కొద్దీ శుభాలను కలుగుతాయి.
నాటాల్సిన మొక్క, లేదా విత్తనాన్ని గాని ఎక్కడ వీలైతే అక్కడ, రోడ్లపక్కన, పార్కు, కొండ, అడవి, ఆలయాల్లో ఎక్కడ వీలుంటే అక్కడ నాటవచ్చు. అయితే అది పెరిగేలా శ్రద్ధ చూపించాలి. మీ నక్షత్రం చూసుకుని ప్రతినెలా ఒక్కసారైనా ఆ వృక్షాన్ని దర్శించి నమస్కరించడం ద్వారా శుభం. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆ వృక్షాన్ని దూషించడంగాని, నరకడం గాని చేయకూడదు. పసి పిల్లలచేత కూడా ఇలా జన్మనక్షత్రానికి అనుగుణంగా వృక్షాన్ని నాటించి చూడండి వారి జీవితంలోనూ శుభాలే కలుగుతాయి.
వృక్షాలు.. ఫలితాలు
అశ్వని నక్షత్రం
అశ్వని నక్షత్ర జాతకులు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచాలి, పూజించడం మంచిది. దీని వలన జననేంద్రియాలు, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అభివృద్ధి చెందుతుంది.
భరణి నక్షత్రం
భరణి నక్షత్ర జాతకులు ఉసిరిచెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణవ్యవస్థ, ఉదర సంబంధిత, పైత్యం, పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే వారికి క్రియేటివిటి ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకుని చక్కగా రాణించేందుకు ఉపకరిస్తుంది
కృత్తిక నక్షత్రం
కృత్తిక నక్షత్రం అత్తి,మేడి చెట్టును పెంచాలి, పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఎలాంటి విమర్శలనైన తట్టుకుని నిలబడే శక్తి వస్తుంది.
రోహిణి నక్షత్రం
రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షనాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబంధించిన వృత్తుల్లో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
మృగశిర నక్షత్రం
మృగశిర నక్షత్ర జాతకులు మారేడు, చండ్రచెట్టును పెంచాలి, పూజించాలి. తద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్తి.. వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్థికపరమైన చిక్కుల నుంచి బయటపడతారు.
ఆరుద్ర నక్షత్రం
ఆరుద్ర నక్షత్ర జాతకులు చింతచెట్టును పెంచాలి. పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతే కాకుండా విషజంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకుని విజయాలు సాధించేందుకు ఉపయోగపడుతుంది.
పునర్వసు నక్షత్రం
పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచాలి, పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుంచి, రొమ్ము కేన్సర్ నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకు లోటు ఉండదని చెప్పవచ్చు. జఠిల సమస్యలు వచ్చినా, చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.
పుష్యమి నక్షత్రం
పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల నరాల సంబంధిత బాధలు నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవతులవుతారు.
ఆశ్లేష నక్షత్రం
ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచాలి, పూజించాలి. దీనివలన శ్వేత కుష్ఠు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కార పరిస్థితుల్లో చాకచక్యంతో బయట పడటానికి కూడా ఉపయోగపడుతుంది.
మఖ నక్షత్రం
మఖ నక్షత్ర జాతకులు మర్రి చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రులకు, సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాల్లో ఆటంకాలు కలగకుండా ఉంటాయి.
పుబ్బ నక్షత్రం
పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పొచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎలాంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.
ఉత్తర నక్షత్రం
ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి, మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
హస్తనక్షత్రం
హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి, కుంకుడు చెట్లు పెంచాలి, పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకుని అన్నింటికీ ఎదురీది విజయం సాధించేందుకు, దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.
చిత్త నక్షత్రం
చిత్త నక్షత్ర జాతకులు మారేడు లేదా తాళచెట్టును పెంచాలి, పూజించాలి. దీని వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది.
స్వాతి నక్షత్రం
స్వాతి నక్షత్ర జాతకులు మద్దిచెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దూరంగానే ఉంటాయి. రకరకాల విద్యలలోను రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.
విశాఖ నక్షత్రం
విశాఖ నక్షత్ర జాతకులు వెలగ, మొగలి చెట్లను పెంచాలి, పూజించాలి. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడడానికి, ముందు చూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.
అనురాధ నక్షత్రం
అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది.
జ్యేష్ఠ నక్షత్రం
జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల కాళ్లు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది.
మూల నక్షత్రం
మూల నక్షత్ర జాతకులు వేగి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల దంతాలకు సంబంధించిన, మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది.
పూర్వాషాఢ నక్షత్రం
పూర్వాషాడ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచాలి, పూజించాలి. దీనివల్ల కీళ్లు, సెగ గడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
ఉత్తరాషాఢ నక్షత్రం
ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు పనస చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు. ఆర్దికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకు సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది.
శ్రవణ నక్షత్రం
శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించేడానికి, కార్యజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది.
ధనిష్ఠ నక్షత్రం
ధనిష్ఠ నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధికి ఉపయోగపడుతుంది.
శతభిషం నక్షత్రం
శతభిషం నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన, మోకాళ్ల సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం, చక్కటి ఉద్యోగం కోసం జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.
పూర్వాభాద్ర నక్షత్రం
పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకు సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి స్థితిని పొందడానికి. కళలు, సాంస్కృతిక రంగాల్లో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాల్లో తిరిగే అవకాశం, ఆర్థిక స్థిరత్వం, రాజకీయాల్లో రాణించేందుకు ఉపయోగపడుతుంది.
ఉత్తరాభాద్ర నక్షత్రం
ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల శ్వాసకోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠల కోసం, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కోసం ఉపయోగపడుతుంది.
రేవతి నక్షత్రం
రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాల్లో నైపుణ్యం కోసం, కీలక పదవులు, సంతాన ప్రేమ, గౌరవం అప్యాయతలు వృద్ధి చెందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.

:: దిండిగల్​ ఆనంద్​శర్మ
సీనియర్​ జర్నలిస్ట్​
సెల్​నం.96660 06418