Breaking News

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి

సారథి న్యూస్, మెదక్: వానాకాలం వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలూ అందుకు అనుగుణంగా ముందుగానే ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్​లో వర్షాలు ఎక్కువగా కురవడంతో జిల్లావ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో వరిని సాగుచేశారని వివరించారు.

అంచనా ప్రకారం మూడున్నర లక్షల టన్నుల ధాన్యం పండుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, డీఆర్డీఏ, సహకార, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల అధికారులు ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్లు, ధాన్యం బస్తాలు, ట్రాన్స్​పోర్టు లారీలను ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం రెడీ చేసుకోవాలని సూచించారు. సమావేశంలో రైస్​మిల్లర్స్​ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు చంద్రపాల్, డీఎస్పీ కృష్ణమూర్తి, జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్​గౌడ్​, డీఆర్డీవో శ్రీనివాస్, సివిల్ సప్లయీస్​ జిల్లా అధికారి శ్రీనివాస్, వ్యవసాయశాఖ అధికారి మార్కెటింగ్, ఐకేపీ, సహకార శాఖ అధికారులు, పాల్గొన్నారు.