- ఫేస్‌బుక్ పై ఆ సంస్థ ఉద్యోగి తీవ్ర ఆరోపణలు
- విలువలు లేని సంస్థలో పనిచేయలేనని రాజీనామా
వాషింగ్టన్: విద్వేషాలు, రెచ్చగొట్టే ప్రసంగాలను ప్రోత్సహిస్తూ ఫేస్‌బుక్ లాభం పొందుతోందని ఆ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉన్నతస్థాయి ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేశారు. కొద్దిరోజులుగా ఫేస్‌బుక్ అనుసరిస్తున్న వైఖరి, విధానాలు నచ్చక చాలామంది ఉద్యోగులు బహిరంగ లేఖలు రాస్తూ రాజీనామా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫేస్‌బుక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (సంస్థలో ఎక్కువ వేతనాలు పొందేవాళ్లలో వీళ్లు ఒకరు)గా పనిచేస్తున్న అశోక్ చందవనే అనే ఉద్యోగి తన జాబ్‌కు రిజైన్ చేశాడు. అందుకు గల కారణాలను లేఖలో ఆయన విపులంగా వివరించారు. ఫేస్‌బుక్ మొదలైనప్పుడు ఉన్న వ్యాపార, నైతిక విలువలు కొంతకాలంగా కనుమరుగయ్యాయని.. ద్వేషాన్ని వెదజల్లుతూ లాభాలు పొందాలని చూస్తోందని ఆరోపించారు. కొద్దిరోజులుగా ఫేస్‌బుక్ అనుసరిస్తున్న వైఖరిని ఆయన తూర్పారాబట్టారు. ఉగ్రవాద గ్రూపులు, మతోన్మాద సంస్థలు, రెచ్చగొట్టే ప్రసంగాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని.. కనీసం అలా చేస్తున్న వ్యక్తులు, సంస్థలు పెడుతున్న పోస్టులను తొలగించడం లేదన్నారు.
ఇటీవల అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత యూఎస్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన ‘ఎప్పుడైతే దోపిడీలు మొదలవుతాయో.. అప్పుడే కాల్పులు ప్రారంభమవుతాయి’ అనే పోస్టు తీవ్ర విమర్శలకు దారితీసింది. దీన్ని తొలగించాలని పలువురు ఫేస్‌బుక్ ఉద్యోగులు సంస్థ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్‌ను కోరినా ఆయన అందుకు ఒప్పుకోలేదు. ఇది నిరసిస్తూ దాదాపు నలుగురు ఉన్నతస్థాయి ఉద్యోగులు ఫేస్‌బుక్‌ను వీడారు. ఇదేగాక కెనోషా, విస్కోన్సిన్ లో చోటుచేసుకున్న అల్లర్లలో పలు ఉగ్రవాద సంస్థలు పెట్టిన పోస్టులను కూడా తొలగించడంలో సంస్థ విఫలమైంది. కాగా, ఇవే కారణాలను చూపిస్తూ.. గతవారంలోనే ముగ్గురు ఉద్యోగులు ఫేస్‌బుక్ నుంచి వైదొలగడం గమనార్హం. ఇక భారత్‌లోనూ పలువురు ఆరెస్సెస్, బీజేపీ అనుబంధ సంస్థలు, అందులో పనిచేసే నాయకులు చేస్తున్న రెచ్చగొట్టే ప్రసంగాలను తొలగించడంలో ఫేస్‌బుక్ దారుణంగా విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఫేస్‌బుక్ యాజమాన్యానికి లేఖలు కూడా రాశారు. కాగా, ఇటీవలే తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్‌బుక్ ఖాతాను తొలగించింది.