Breaking News

దేశం శిఖ‌ర స‌మాన‌ నాయ‌కుడిని కోల్పోయింది

దేశం శిఖ‌ర స‌మాన‌ నాయ‌కుడిని కోల్పోయింది

  • క్రమశిక్షణ, క‌ఠోరశ్రమ, అంకిత‌భావంతో అంచెలంచెలుగా ఎదిగారు
  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి తెలంగాణ అసెంబ్లీ సంతాపం

సారథి న్యూస్, హైద‌రాబాద్: భార‌త‌ర‌త్న, దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు స‌భ‌లో ప్రవేశపెట్టారు. ‘ప్రణబ్ ​మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ ఆయ‌న కుటుంబస‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. భార‌త‌దేశం శిఖ‌ర స‌మాన‌మైన నాయ‌కుడిని కోల్పోయింది. 1970 త‌ర్వాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్​ముఖ‌ర్జీ పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. క్రమశిక్షణ, క‌ఠోర శ్రమ అంకిత‌భావంతో అంచ‌లంచెలుగా ఎదిగారు. దేశఆర్థిక వ్యవస్థను అత్యున్నత స్థాయిలో నిల‌బెట్టారు. ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. మ‌హోన్నత రాజ‌నీతిజ్ఞుడిగా మెలిగారు. మిత్రపక్షాలను కలుపుకుని పోవడంలో విశ్వసనీయుడిగా పేరొందారు. భార‌త 13వ రాష్ట్రపతిగా అత్యున్నత ప‌ద‌వి అలంక‌రించిన‌, జాతి నిర్మాణంలో ఆయ‌న అందించిన సేవ‌ల‌కు గుర్తింపుగా 2019లో భార‌త‌ర‌త్న అవార్డును బ‌హుక‌రించారు. తెలంగాణ రాష్ర్ట అవ‌త‌ర‌ణ‌కు స‌హాయప‌డిన వారిగా కాకుండా, రాష్ర్ట విభ‌జ‌న బిల్లుపై ముద్రవేసి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు.’ అని సీఎం కేసీఆర్​తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.