Breaking News

దుబ్బాక బరిలో రామలింగారెడ్డి సతీమణి సుజాత

దుబ్బాక బరిలో రామలింగారెడ్డి సతీమణి సుజాత

సారథి న్యూస్​, హైదరాబాద్​: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోటీచేసేందుకు దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కె.చంద్రశేఖర్​రావు దాదాపు ఖరారు చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత లేదా కుమారుడు సతీష్‌రెడ్డికి టికెట్‌ దక్కడం దాదాపు ఖాయమనే ప్రచారం జరిగింది. చివరికి రామలింగారెడ్డి భార్య సుజాత పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.

జర్నలిస్టుగా పనిచేసిన రామలింగారెడ్డి 2004, 2008లో దొమ్మాట నుంచి, 2009, 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాక నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. 2009 మినహా అన్ని ఎన్నికల్లోనూ రామలింగారెడ్డి గెలుపొందారు. 2018 మినహా అన్ని ఎన్నికల్లోనూ మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఆయనకు ప్రత్యర్థిగా పోటీచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ముత్యంరెడ్డి గతేడాది సెప్టెంబర్‌లో అనారోగ్యంతో మరణించారు. అంతకుముందు చెరుకు ముత్యంరెడ్డి తన తనయుడు శ్రీనివాస్‌రెడ్డి కూడా టికెట్‌ కోసం ప్రయత్నాలు సాగించారు. సీఎం కేసీఆర్​ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం సిద్దిపేట నియోజకవర్గాలకు దుబ్బాక పొరుగునే ఉంది. మంత్రి హరీశ్​రావు దుబ్బాక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి కార్యకర్తలతో భేటీ అవుతున్నారు.